ప్రముఖ ఆర్థిక వేత్త ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం రేపు రాష్ట్రానికి రానుంది ప్రముఖ ఆర్థిక వేత్త ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం రేపు రాష్ట్రానికి రానుంది. ఈ నెల 17నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు పర్యటించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పాటు మిషన్ భగీరథ పనులను పరిశీలించనున్నారు. రాష్ట్ర వాదనను బలంగా ఆర్థికసంఘం ముందు వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మిస్తోన్న ఆనకట్ట పనులను పరిశీలిస్తారు.
జగిత్యాల జిల్లాలో ఉన్న ఆరో ప్యాకేజీని బృందం సందర్శిస్తుంది. సొరంగం, పంప్ హౌజ్, సర్జ్ పూల్ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత సిరిసిల్ల వెళ్లి అక్కడ మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలిస్తారు. కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ 18న హైదరాబాద్ వస్తారు. అదేరోజు వ్యాపార వర్గాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషన్ సమావేశమవుతుంది. 19న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆర్థిక సంఘం భేటీ అవుతుంది. రాష్ట్ర అవసరాలు, ప్రాధాన్యతలను ఆర్థికసంఘం ముందు ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 నుంచి 50 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేయనుంది. కేంద్రం నుంచి మరింత సహకారం కోరే అభిప్రాయాన్ని కమిషన్ ముందు బలంగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తోంది.