తెలంగాణలో సినిమా థియేటర్ల వ్యవస్థను కాపాడాలని తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి... సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కోరింది. సినిమా థియేటర్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా జారీ అయ్యేలా చూడాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి సునీల్ నారంగ్ మంత్రిని కోరారు.
తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ కిషోర్ బాబు, పలువురు ఎగ్జిబిటర్లతో కలిసి మంత్రిని కలిసిన సునీల్ నారంగ్... థియేటర్లకు అండగా నిలిచి సినిమాను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు థియేటర్ల నిర్వహణ ఛార్జీ రద్దుతో పాటు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడం, జీఎస్టీ రాయితీ, స్థిరాస్తి పన్నులో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఛాంబర్ ప్రతినిధులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.
ఛాంబర్ ప్రతినిధుల విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి తలసాని... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా ఉత్తర్వులు జారీ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.