రాష్ట్రంలో వైద్య సీట్ల భర్తీలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని రాష్ట్ర బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వైద్య సీట్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు.
దేశమంతా ఒకే విధానం కొనసాగుతుండగా రాష్ట్రంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. బడుగు విద్యార్థులకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల భర్తీలో జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాళోజీ విశ్వవిద్యాలయం ఉపకులపతిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడుతామని జాజుల హెచ్చరించారు. ఈ సమావేశంలో మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.