రాష్ట్రంలో భుకబ్జాలపై కలిసికట్టుగా పోరాటం చేద్దామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ భూపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎవాక్యూ, సర్కారీ, వక్ఫ్, వ్యవసాయ, భూదాన్, ఆదివాసీల భూములు, మిగులు భూములు, చెరువులు, నాళాలు, గురుకుల ట్రస్ట్ భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాలుగా భూపరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్న అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
కలిసి పోరాడుదాం-భూబకాసురులను తరిమికొడదాం- తెలంగాణ అమరవీరుల ఆశయాలు కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. హఫీజ్‌పేట భూములు వివాదంపై మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టును నారాయణ గుర్తు చేశారు.
భూకబ్జాదారులు పుట్టుకొస్తున్నారు : ఎల్.రమణ
ఏ పార్టీ అధికారంలో ఉన్నా భూబకాసురులు, దోపిడీదారులకు రక్షణ కల్పిస్తున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ఒకప్పుడు రాజధాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న భూముల ధరలు వేలల్లో ఉండేవన్నారు. స్థిరాస్తి వ్యాపారం పుణ్యమాని ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ పలుకుతుండటంతో భూకబ్జాదారులు పుట్టుకొస్తున్నారని విమర్శించారు. చట్టాల్లో లొసుగులు అడ్డు పెట్టుకుని భూమాఫియా చెలరేగి పోతోందని తెలిపారు. ప్రభుత్వ, పేదల భూముల రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధం కావాలని రమణ కోరారు. భూకుంభకోణాల్లో ఏ రాజకీయ పార్టీ హస్తం ఉన్నా ఏ మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ భూపరిరక్షణ సమితి ప్రతినిధులు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య, సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్‌రెడ్డి పాల్గొన్నారు.