కొత్త పాసు పుస్తకాలు పొందాక మరణించిన గిరిజనేతర రైతు కుటుంబ సభ్యులకు వారసత్వ బదిలీ చేయడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య భాగ పంపిణీని సైతం పక్కన పెడుతున్నారు. ఇలాంటి సమస్యలతో పాసుపుస్తకాలు రాని వారికి దరఖాస్తు చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది. ఏజెన్సీ చట్ట పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారి ఆవేదన అంతా ఇంతా కాదు.
రుణాలూ పొందలేని దుస్థితి
ధరణికి ముందు వరకు భూమిని తనఖా(మార్టిగేజ్) పెట్టి సాగు రుణాలు పొందిన రైతులకు ఇప్పుడది సాధ్యం కావడం లేదు. ధరణిలో సర్వే నంబర్లు, ఖాతాలు లేవని ఈ ప్రాంతాల్లోని రైతులకు రుణాలు ఇచ్చేందుకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రైవేటు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఎల్‌ఆర్‌యూపీ సందర్భంగా ఆర్‌ఎస్‌ఆర్ విస్తీర్ణం పెరగడం, సర్వే నంబర్లు తప్పిపోవడం లాంటి సమస్యలతో కొందరి పేర్లు పోర్టల్లోకి చేర్చలేదు. ఇలాంటి వారిని పార్ట్-బి కింద చేర్చారు. కుటుంబ పెద్ద మరణించగా భార్య/వారసులకు కొత్త పాసుపుస్తకం జారీచేయాల్సి ఉండటం, భూమి కొని మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న క్రమంలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తేవడం వల్ల పుస్తకాలు అందలేదు. తహసీల్దార్లకు పాసుపుస్తకాల జారీ అధికారాన్ని నిలిపివేయడం ఇక్కడి రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
ధరణిలో ఉన్నవారికే పథకాలు
అనంతరం అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్లో పేరు నమోదై ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తుండగా భూ లావాదేవీలకు సైతం వీలు కల్పించారు. పోర్టల్లో లేని రైతులు కలెక్టర్లకు అర్జీ పెట్టుకుని హక్కులు పొందాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే.. ఆన్‌లైన్‌లో కనీస సమాచారం లేనివారికి దరఖాస్తు చేయడానికి వీలు కావడం లేదు. భూ బదిలీ నిషేధిత చట్టం(ఎల్‌టీఆర్) కింద దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించడం లేదు. ఇప్పటి వరకు ఈ జిల్లాల్లో 72 వేల కేసులు ఇలా అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితే తప్ప ఏజెన్సీ ప్రాంత వాసులకు న్యాయం జరగదని భూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: సకల సౌకర్యాలతో త్యాగధనుల కాలనీ.. ఈ వారంలోనే గృహప్రవేశాలు!