Farmers Unions Of Maharashtra Join BRS: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశమంతటా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లేకుండా ఉండదన్న సీఎం.. రైతుల పోరాటం వల్లే కేంద్రం మూడు సాగు చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. చిత్తశుద్ధితో చేస్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర రైతు నేతలు శరత్‌జోషి, ప్రణీత్, తదితరులకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి సాదారంగా ఆహ్వానించారు.
అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా రైతుల కోసం దిల్లీలో పోరాటాలు చేశానని సీఎం కేసీఆర్ తెలిపారు. తన రాజకీయ జీవితమంతా పోరాటాల మయమేనని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర రైతులు చేస్తున్న పోరాటం న్యాయమైనది.. వారు తలచుకుంటే ఆ సమస్య సాధ్యం కాదా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు. ఒకసారి దేశ చరిత్రను చూసుకుంటే రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే ఒక ఉదాహరణగా చెప్పవచ్చని అన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రైతుల పోరాటాల వల్లే రద్దు చేశారని గుర్తు చేశారు.
యాసంగి సాగులో తెలంగాణ నెం1: బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర రైతులను సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆత్మహత్యలు సంఖ్య పెరుగుతుంటే.. ఆసంఖ్య తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పూర్తిగా తగ్గిపోయిందని వివరించారు. అందుకే తాను దేశమంతటా కూడా తెలంగాణ పరిస్థితులే రావాలంటూ సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యాసంగిలో 90 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు అవుతుందని వివరించారు. యాసంగి సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి సాధించడం లేదని ఆరోపించారు. చాలా దేశాల్లో రైళ్ల వేగం గంటకు 1500 కి.మీ. ఉంటే భారత్లో మాత్రం 150 కి.మీగా ఉందని స్పష్టం చేశారు.
"50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశాను. తాను ఏ సమస్యకు భయపడలేదు. రైతుల పోరాటం న్యాయబద్దమైనది. మహారాష్ట్ర రైతు నేతలు గెలవాలంటే చిత్తశుద్ధితో పాటు.. ఆలోచనల్లో నిజాయతీ ఉండాలి. తెలంగాణలో అభివృద్ధి ఎలా చేశామో మీరంతా ఒకసారి చూడండి. రైతుల సమస్యలపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. రైతుల పోరాటం వల్లే కేంద్రంలోని మూడు సాగు చట్టాలను రద్దు చేశారు." - సీఎం కేసీఆర్
ఇవీ చదవండి: