Farmers Associations Dharna at Indira park: సాగు చట్టాల రద్దు బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ.. ఇందిరాపార్క్ వద్ద రైతు సంఘాలు మహాధర్నాకు దిగాయి. ఆలిండియా రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా మహాధర్నా నిర్వహిస్తున్నారు. కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్‌తో పాటు ఏఐకేఎంఎస్(AIKMS) ప్రధాన కార్యదర్శులు అతుల్ కుమార్ అంజన్, హన్నన్ మెల్లా, ఏఐకేఎంఎస్ నేతలు జీఎస్ ఆశిష్ మిత్తల్, భూమి బచావో ఆందోళన్ నేత జగ్తార్ బాజ్వా తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులను ఆదుకోండి..
సాగుచట్టాల రద్దును పార్లమెంట్‌లో ఆమోదించాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేసి ఆమోదించాలని.. ఆలిండియా రైతు పోరాట సమన్వయ సమితి డిమాండ్ చేసింది. కనీస మద్ధతు ధరల గ్యారంటీ చట్టం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు.
తరలివచ్చిన రైతులు
rakesh tikait in Hyderabad : ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మహాధర్నా 4 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కిసాన్ నేతలు మీడియాతో మాట్లాడనున్నారు. అన్ని రకాల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టం ప్రవేశపెట్టి అమలు చేయాలని ఈ వేదిక ద్వారా కిసాన్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో హైదరాబాద్‌లో చేపట్టిన ఈ మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజా సంఘాల కార్యకర్తలు తరలివచ్చారు.
కేసీఆర్‌కు ధన్యవాదాలు
Farmer's Association Dharna at Indira Park 2021 : కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మెుల్లా డిమాండ్ చేశారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. దేశంలో ప్రతిరోజు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.... మోదీ అధికారంలోకి వచ్చాక లక్ష మందికి పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెుల్లా ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ రేసులో దేవెగౌడ మనవడు.. గెలిస్తే ఫ్యామిలీ అరుదైన ఘనత