అది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని వీరంపాలెం. రెండేళ్ల క్రితం వచ్చిన వరదల కారణంగా ఊరి నుంచి పొలాలకు వెళ్లే వంతెన కూలిపోయింది. వంతెనను తిరిగి నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను రైతులు వేడుకున్నారు. సమస్య పరిష్కారమవుతుందని ఆశగా రెండేళ్లు ఎదురుచూశారు. అయినా లాభం లేకపోయింది. సమస్య పరిష్కారం కోసం రైతులందరూ ఏకమయ్యారు. తాళ్ల వంతనెను నిర్మించి ఔరా అనిపించారు.
ఈదుకుంటూ పనులకు..
వంతెన నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాలువలో ఈదుకుంటూ పొలాలకు వెళ్లి వ్యవసాయం చేసుకునేవారు. ఆయా పొలాల్లో వ్యవసాయ పనులు చేసేందుకు కూలీలు రాకపోవడంతో రైతులు ఎంతో ఇబ్బంది పడేవారు. దీంతో అక్కడ వ్యవసాయం అగమ్యగోచరంగా మారింది.
చందాలు వేసుకున్నారు...
అధికారులు, ప్రజా ప్రతినిధులను నమ్ముకోకుండా సమస్య పరిష్కారానికై రైతులందరూ ఏకమయ్యారు. చందాలు వేసుకుని తాళ్ల వంతెనను నిర్మించుకునేందుకు నడుం కట్టారు. రైత్వారిలో తమకు ఉన్న పరిచయాలతో ట్రాక్టర్ ట్రక్కులకు ఉపయోగించే ఇనుప చానల్ ముక్కలు, విద్యుత్ తీగలు, ఐరన్ ఊచలు, కోళ్లఫారంలో ఉపయోగించే జల్లెడ లాంటి మెష్లతో ప్రతి రైతు ఒక ఇంజినీరుగా మారి తాళ్ల వంతెన నిర్మాణం చేశారు. అన్నదాతల ఉక్కు సంకల్పంతో సమస్యను పరిష్కరించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ముక్కున వేలు వేసుకునేలా చేశారు.
ఇదీ చదవండి: 28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు..ఈనెల 9న రెవెన్యూ బిల్లు