కలుపు సమస్యతో కలవరం....
పచ్చటిపొలంలో రంగవల్లులేసినట్లు... నేలమ్మకు రంగుల సొబగులద్దినట్లు ఉన్న ఈ పొలం... ప్రకాశం జిల్లా రాకూరు సమీపంలో ఉంది. ఈ చేనును సాగుచేస్తున్న రైతు పేరు మురళీకృష్ణ. చేలో రంగులేంటని మురళీకృష్ణను అడిగితే.. అసలు విషయం చెప్పాడు. ఈయన... 4 ఎకరాల్లో ఈయన బొప్పాయి సాగు చేస్తున్నాడు. కౌలుకు తీసుకొని తోట వేసిన మురళీకృష్ణను... కలుపు సమస్య తీవ్ర ఇబ్బంది పెట్టేది. కలుపు నివారణ మందుల కొనుగోలు, కూలీలను రప్పించడం ఆర్థిక భారం.
మల్చింగ్ విధానమే పరిష్కారమని....
ఈ సమస్యకు ఉద్యానశాఖ అవలంబిస్తున్న మల్చింగ్ విధానమే పరిష్కారమని... ఆ దిశగా చర్యలు తీసుకున్నాడు. ఇంతకీ మల్చింగ్ విధానం అంటే ఏంటంటే.... చేలో బోదెలు కట్టి, వాటిని కప్పివేసి... కలుపు మొక్కల పని పట్టడమే. వాస్తవానికి మల్చింగ్ విధానంలో.. బోదెలను కప్పడానికి ఉద్యానశాఖ అందించే పేపర్ కానీ.. పాలిథిన్ సంచులు కానీ ఉపయోగించాలి. అయితే ప్రస్తుతానికి ఈ పథకం అందుబాటులో లేదు. కొందరు రైతులు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. అసలే కౌలుకు సాగు చేస్తున్న మురళీకృష్ణ... ఈ మల్చింగ్ పేపర్‌ను సొంతంగా కొనుగోలు చేయాలంటే 60 వేల రూపాయల పైనే ఖర్చు చేయాలి. అంత డబ్బు పెట్టలేక, బుర్రకు పదును పెట్టాడు. పేపర్, పాలిథిన్ బదులు చీరలు వాడటానికి నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని అమల్లోకి అమల్లోకీ తెచ్చాడు.
కలుపు పని పట్టారు...
ఒక్కో పాతచీరను 11 రూపాయల చొప్పున కొన్నాడు. ఇలా 4 ఎకరాలకు దాదాపు 13 వేల రూపాయలు ఖర్చు చేశాడు. చేలో బోదెలు కట్టి... చీరలను మల్చింగ్‌లా పరిచాడు. ఈ విధానంతో కలుపు మొక్కల పెరుగుదల పూర్తిగా తగ్గిందని మురళీకృష్ణ చెప్పాడు.రైతులు ఏ పంట వేసినా ఖర్చు తడిచి, మోపెడవుతున్న ఈ కాలంలో... 60 వేలు ఖర్చు చేయాల్సిన చోట 47 వేలు పొదుపు చేయడం గొప్ప విషయం. ఈ విధానంపై ఇతర రైతులూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.