కరోనాపై అవగాహన కల్పించి ఆ మహమ్మారికే బలైపోయిన ప్రముఖ కవి, రచయిత నిస్సార్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో నిస్సార్ సంతాప సభను ఏర్పాటు చేశారు. జూమ్ యాప్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ సంతాప సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.
సామాజిక స్పృహ, సృజనాత్మకత ఉన్న నిస్సార్... గద్దర్ తరవాత నయా గద్దర్‌గా పేరు తెచ్చుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కరోనాపై పాటలు రాసి అవగాహన కల్పించిన నిస్సార్ కరోనాతోనే మరణించడం బాధాకరమన్నారు. నిస్సార్ మృతి తనను కలిచివేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజా గాయకుడు నిస్సార్ మలిదశ తెలంగాణ ఉద్యమం, ఆర్టీసీ పోరాటాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తెలిపారు.