నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. నందమూరి కుటుంబసభ్యులు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌కు తరలివచ్చి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఒక సంచలనమని ఆయన కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరి కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నేటి నుంచి వచ్చే ఏడాది వరకు నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగుతామని ఆయన కుమారులు జయకృష్ణ, రామకృష్ణ తెలిపారు. అనంతరం కుట్టు మిషన్లు, వీల్ ఛైర్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ లఘు చిత్ర మాలికను ఆవిష్కరించిన కుటుంబ సభ్యులు తిలకిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెరాస మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపుడి గాంధీ, మాజీ మంత్రి మెత్కుపల్లి నరసింహాలు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగుబిడ్డగా ప్రపంచ ఖ్యాతిని గడించారని కార్మిక శాఖమంత్రి మల్లా రెడ్డి కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా పార్లమెంటులో పోరాడతామని నామానాగేశ్వరరావు అన్నారు. పరిటాల రవీంద్రను తన కొడుకుల్లాగానే ఎన్టీఆర్ చూసుకునేవారిని మాజీమంత్రి పరిటాల సునీత తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ పెట్టిన భిక్ష వల్లే నటుడిగా మీ ముందు ఉన్నానని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ రోజు పెద్ధాయన బతికి ఉంటే బంగారు పూలతో పాద పూజ చేసేవాడినని తెలిపారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నేటి నుంచి 2023 మే 28 వరకు నిర్వహించనున్నారు. వేడుకలు నిర్వహించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కేంద్రాలను గుర్తించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం కమిటీని నియమించారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా అన్ని రంగాల్లో నిష్ణాతులైన కళాకారులను ఘనంగా సత్కరించనున్నారు. వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటోను ముద్రించాలని ఆర్బీఐని కోరనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.