ప్రముఖ పాత్రికేయులు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు(87) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో చికిత్స చేస్తుండగా 12.30 గంటలకు గుండెపోటు రావడంతో తుర్లపాటి కన్నుమూశారు. కుటుంబరావు 1933 ఆగస్టు 10న విజయవాడలో సుందర రామానుజరావు, శేషమాంబ దంపతులకు జన్మించారు. తన 14వ ఏట 1946లో పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి తనదైన ముద్రవేశారు. ఆంధ్రరాష్ట్రం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగానూ పనిచేశారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే అనేక మంది పాత్రికేయ ప్రముఖులు శోఖసంద్రంలో మునిగారు.
తుర్లపాటి కుటుంబరావుకు పాత్రికేయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అనేక విషయాలపై విశ్లేషణలు చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు ప్రసిద్ధికెక్కారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు కొని నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది ముఖ్యమంత్రులతో తుర్లపాటి పనిచేశారు. ఆయన రాసిన ‘18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు’ అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరు గడించారు. జర్నలిస్టుగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం ప్రభుత్వం 2002లో ప్రతిష్టాత్మక పద్మశ్రీని అందించింది.
‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌గా
1951లో ఆచార్య ఎన్‌జీ రంగారావు వాహిని పత్రికలో మొదటిసారిగా కుటుంబరావు ఉప సంపాదకుడిగా పనిచేశారు. అనంతరం చలసాని రామారాయ్ ‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. రాజకీయలపై చేస్తున్న విశ్లేషణలను చూసి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన్ని చెన్నైకి పిలిపించి, తను నడుపుతున్న ప్రజాపత్రికలో సహాయ సంపాదకుడిగా నియమించారు. అంతేకాకుండా సహాయ సంపాదకుడితో పాటు ప్రకాశం పంతులుకు కార్యదర్శిగానూ ద్విపాత్రాభినయం చేశారు. ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో కుటుంబరావును తనతో పాటే ఉండమని చెప్పారు. దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రభుత్వంలో ఉండి నిజాలను కప్పిపెడుతూ రాయలేనని, జర్నలిస్టుగానే ఉంటానని కుటుంబరావు పేర్కొన్నారు. దీంతో ఆయనకు పాత్రికేయ వృత్తిపై ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతోంది. అనంతర కాలంలో ఆంధ్రజ్యోతికి ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు.
గాంధీ నుంచి ఆటోగ్రాఫ్..
విజయవాడకు వచ్చిన మహత్మా గాంధీ నుంచి 14 ఏళ్ల ప్రాయంలో ఆటోగ్రాఫ్ పొందారు. ప్రముఖ నాయకులు అంబేద్కర్, నెహ్రూ, రాజాజీలను ఇంటర్వ్యూ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయవాదులు, ప్రముఖ వ్యక్తులు ఇలా దాదాపు 6 వేల బయోగ్రఫీలను ఆయన రాశారు. ఇలా తెలుగు సాహిత్యంలో వ్యక్తుల జీవిత చరిత్రల రచయితగా ముద్ర వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో దాదాపు 20 వేల సమావేశాల్లో వక్తగా ప్రసంగించారు. దీంతో గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. జాతక కథలు, జాతి నిర్మాతలు, మహానాయకులు, విప్లవ వీరులు, నా కలం నా గళం, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు తదితర పుస్తకాలు రాశారు. ప్రముఖ జాతీయ నేతల ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేశారు.
పాత్రికేయ భీష్ముడిగా ప్రసిద్ధి చెందిన కుటుంబరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్తు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కుటుంబారావును కళాప్రపూర్ణతో గౌరవించింది. 1969లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీలో సభ్యునిగా కేంద్రం ప్రభుత్వం తుర్లపాటిని నియమించింది. నేషనల్ ఫిల్మ్ అడ్వైజరీ కమిటీలో, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యారు. సుమారు మూడు దశాబ్దాల పాటు ఏపీ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు.
అనేక అవార్డులు సొంతం..
1989లో ముట్నూరి కృష్ణారావు నుంచి ఉత్తమ ఎడిటర్ అవార్డు పొందిన కుటుంబరావు, 1990లో ఉత్తమ జీవిత చరిత్రల రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవార్డు అందుకున్నారు. ఉపన్యాస కేసరి బిరుదు వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. 1994లో కాశీనాథుని నాగేశ్వరరావు నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. 1993లో గిన్నిస్ బుక్ అవార్డు, 1998లో అమెరికా నుంచి వరల్డ్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు పొందారు. 2002లో పద్మశ్రీ అవార్డు పొందారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభంపై నేడు స్పష్టత