Doctor Rajesh Maddipati Interview on amnesia: వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధులూ ముసురుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె, మెదడు జబ్బుల బారినపడే అవకాశాలుంటాయి. ఇవన్నీ నియంత్రణలో లేకపోతే మెదడులోని కొన్ని భాగాల్లో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు. ఫలితంగా ప్రాణవాయువు సరిగా అందక మెదడు కణాలు బలహీనమవుతాయి. ఆ ప్రభావం జ్ఞాపకశక్తిపై పడి మతిమరుపునకు దారితీస్తుంది. వృద్ధాప్యంలో మతిమరుపు ముప్పును తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు యూకేలోని ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రాజేశ్ మద్దిపాటి. ఇందుకోసం అవలంబించాల్సిన విధానాలను 'ఈటీవీ భారత్' ముఖాముఖిలో డాక్టర్ రాజేశ్ పంచుకున్నారు.
- వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకు మార్గమేమిటి ?
వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏ విషయంపైనా సరైన నిర్ణయం తీసుకోలేరు. పదిమందితో కలిసి మాట్లాడలేరు. బయటకు వెళ్తే తిరిగి ఇంటికొచ్చే దారిని కూడా మరిచిపోతుంటారు. వీటన్నిటికీ ప్రధానంగా మెదడులో జరిగే మార్పులే కారణం. రకరకాల వ్యాధుల వల్ల ఇలా జరుగుతుంది. విటమిన్ బి 1, బి 12 లోపం, అదుపు లేని హైపోథైరాయిడిజం, మధుమేహం, అధిక రక్తపోటు, తలకు బలమైన గాయాలైనప్పుడు, మాదక ద్రవ్యాలకు బానిసలైనవారిలోనూ, దీర్ఘకాలంగా ఆందోళన, కుంగుబాటుతో బాధపడేవారిలోనూ మతిమరుపు రావచ్చు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, పక్షవాతం, పార్కిన్‌సన్స్ వంటి జబ్బుల్లోనూ రక్తనాళాలు సంకోచించడంతో మెదడుకు రక్తం సరఫరా తగ్గుతుంది. హెచ్‌ఐవీ, క్షయ వంటి వ్యాధుల్లోనూ ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధుల నివారణ లేదా నియంత్రణకు జాగ్రత్తలు అవసరం.
- ఆరోగ్యకరమైన అలవాట్లకు.. మతిమరుపు నిరోధానికి సంబంధమేమిటి?
కచ్చితంగా ఉంది. ఉదాహరణకు పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులపై విపరీతమైన దుష్ప్రభావం పడుతుంది. గుండె, మెదడు భాగాల్లోని రక్తనాళాలు సన్నబడతాయి. పొగాకు వల్ల విడుదలయ్యే రసాయనాలు రక్తనాళాల గోడలను దెబ్బతీస్తాయి. మెదడు పనితీరుపైనా దుష్ప్రభావం చూపుతాయి. ఫలితంగా మెదడు కణాలు తగ్గిపోయి, మతిమరుపునకు దారి తీస్తుంది. మద్యపానం వల్ల కూడా మెదడు కణాలపై దుష్ప్రభావం పడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వృద్ధాప్యంలో ఎనలేని మేలు చేస్తుంది. తద్వారా రోగ నిరోధక శక్తి, గుండె, ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణ వేగం పెరుగుతాయి. వ్యాయామం చేయనివారు బరువు పెరిగి.. గుండె, మెదడు రక్తనాళాల్లో సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముంది. కనీసం 30-40 నిమిషాలైనా శారీరక వ్యాయామం చేయడం యుక్తవయసు నుంచే అలవాటు చేసుకోవాలి.
- ఈ సమస్యను అధిగమించడంలో కుటుంబసభ్యుల తోడ్పాటు ఎలా ఉండాలి?
మనిషి సగటు ఆయుర్దాయం 70 ఏళ్లకు చేరుకుంది. చిన్న కుటుంబాలు కావడం.. తల్లిదండ్రులను వదిలి పిల్లలు ఎక్కడో విదేశాల్లోనో, దూర ప్రాంతాల్లోనో నివసిస్తుండడంతో.. ఇప్పుడు భారత్‌లోనూ మతిమరుపు బాధిత వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మతిమరుపు పెరిగితే.. వారిని సంరక్షించడం కుటుంబానికి పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే కుటుంబసభ్యులు దూరంగా ఉన్నా.. అధునాతన పరిజ్ఞానం సాయంతో వివిధ మాధ్యమాల ద్వారా వారితో తరచూ మాట్లాడాలి.
- ఈ అంశంపై అధ్యయనాలున్నాయా?
ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని పాటిస్తే మలివయసులోనూ చురుగ్గా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై చైనాలో 60 ఏళ్లు దాటిన 29 వేల మందిని పదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ధూమపానం సహా పొగాకు ఉత్పత్తులు, మద్యాన్ని వాడకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఎక్కువమందితో తరచూ కలుస్తుండడం, ఏదో ఒక పనిలో నిమగ్నమవడం.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరికి ప్రతి మూడేళ్లకోసారి జ్ఞాపకశక్తి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యకరమైన అలవాట్లున్న వారిలో జ్ఞాపకశక్తి అమోఘంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్రమం తప్పకుండా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, చేపలు, గుడ్లు, గింజధాన్యాలు, పప్పు దినుసులు, పరిమితంగా నూనె, నిర్దేశిత మోతాదులో ఉప్పు అంటే ఒక వ్యక్తి ఒక్క రోజుకు ఒక్క టీ స్పూన్ ఉప్పు మాత్రమే వాడాలి.. ఈ ఆరు అంశాలను పాటిస్తే.. మతిమరుపు అవకాశాలను 90 శాతం వరకు తగ్గించుకోవచ్చు. వీటిలో 2 లేదా 3 అలవాట్లను మాత్రమే పాటిస్తే మతిమరుపు ముప్పు 30 శాతం వరకు మాత్రమే తగ్గే అవకాశం ఉంటుందని తేలింది. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా ‘బ్రిటిష్ మెడికల్ జర్నల్’లో ప్రచురితమైంది.
- విశ్రాంత జీవితంలో ఇంటికే పరిమితమవడం కూడా మతిమరుపును పెంచుతుందా?
కంప్యూటర్‌లో మనం వేటి గురించి ఎక్కువగా వెతికితే.. ఆయా అంశాలనే అది చూపిస్తుంటుంది. ఉన్నట్టుండి కొత్త అంశాన్ని వెతికితే దానికి కంప్యూటర్ కొంత సమయం తీసుకుంటుంది. మెదడు కూడా అలాగే పనిచేస్తుంది. వయసు పైబడిన తర్వాత ఇంటికే పరిమితమై.. ఒంటరి జీవితం గడుపుతుంటే మతిమరుపు సమస్య పెరుగుతుంది. పరిమిత సంఖ్యలో వ్యక్తులను కలుస్తుంటే.. మెదడు వారిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. సాధ్యమైనంత ఎక్కువమందిని కలుస్తుంటే మెదడు చురుగ్గా స్పందిస్తుంది. శరీరం సహకరిస్తే బయటకు వెళ్లాలి. స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనాలి. వీలైతే ఆటలు ఆడాలి. కూర్చుని ఆడేవైనా ఫర్వాలేదు. మెదడుకు పదును పెట్టే ప్రతి ఆటనూ ఆడాలి. వారానికి రెండుసార్లయినా కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను కలుస్తుండాలి. వీటి వల్ల మతిమరుపు ముప్పును తప్పించవచ్చు.
- యూకేలో మలివయసులో మతిమరుపు సమస్యను తగ్గించడానికి ఏం చేస్తారు?
అరవైయ్యేళ్లు పైబడిన వారిలో ఏడాదికోసారి జ్ఞాపకశక్తి పరీక్షలు తప్పనిసరిగా చేస్తాం. సమస్యను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమవకుండా ఔషధాలిస్తుంటారు. జ్ఞాపకశక్తిని పెంచడానికి వృద్ధులకు పదబంధాలను నింపడం, వాక్య నిర్మాణాలు చేయడం వంటి అభ్యాసాలు చేయిస్తుంటాం. ఇక్కడ వృద్ధులు వారాంతాల్లో సాధ్యమైనంత వరకు ఎక్కువమందిని కలుస్తుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు మెదడుకు మేత, శారీరక శ్రమలు కూడా తోడైతే మతిమరుపు దరిచేరదు.
ఇవీ చదవండి: