సోషల్ మీడియాలో కరోనా గురించి వస్తున్న తప్పుడు సమాచారంపై తెలంగాణ ఐటీశాఖ కొరడా ఝుళిపించింది. అసత్య ప్రచారంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో కేసులు సైతం నమోదు చేస్తోంది. రాష్ట్ర ఐటీశాఖ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ వెబ్‌సైట్ (ఫ్యాక్ట్ చెక్) వారం రోజుల్లో 20 తప్పుడు అంశాలను గుర్తించి వివరణలు జోడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, సమాచారంపై వాస్తవాన్ని https://factcheck.telangana.gov.in/ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
వీటిపై గత వారం రోజుల్లో దాదాపు 200 ఫిర్యాదులు అందాయని ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ తెలిపారు. ప్రతిక్షణం 300 మందికి పైగా వెబ్‌సైట్ సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో డాక్టర్లు, పోలీసు అధికారులు, తదితరుల పేరిట తప్పుడు సమాచారం చేరవేస్తున్న 25 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
నిజం కనిపెట్టేలోపే వైరల్
తప్పుడు సమాచారాన్ని సృష్టించే వ్యక్తులు తాము పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాత వీడియోలు, ఫొటోలను తమకు అనుకూలంగా ఎడిట్ చేసి, ప్రస్తుత అంశాలను జోడించి సామాజిక మాధ్యమాల్లో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులపై నిజనిర్ధారణ చేసేందుకు ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది. ఆలోగా వైరల్ అవుతోంది. తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు 2019లోనే తెలంగాణ ఐటీశాఖ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకుంది. కరోనాపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని విశ్లేషించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన వెంటనే దేశంలోనే తొలుత తెలంగాణ ఐటీశాఖ ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇటీవల ప్రజల్లోకి వెళ్లిన తప్పుడు సమాచారం
- కాణిపాకం దేవాలయాన్ని క్వారంటైన్‌గా మార్చారని, కొందరు చెప్పులతో వెళ్తున్నట్లు వైరల్ అవుతున్న వీడియో అవాస్తవం. వీడియోలో ఉన్నది దేవాలయం కాదు.. వసతిగృహం.
- ఆకలితో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుందని వచ్చిన ఫొటోలు నిజం కావు. ఈ చిత్రాలు కర్ణాటకలో ఓ తాగుబోతు భర్తను భరించలేక గతంలో ఇల్లాలు ముగ్గురు పిల్లల్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనవి.
- గుజరాత్‌లో శ్రీరామనవమి ఘనంగా చేశారన్న ఫొటోలు నిజం కావు. పాత చిత్రాలు జత చేసి వైరల్ చేశారు.
- ఓ వ్యక్తి పోలీసులపై ఉమ్మేశారని వచ్చిన వీడియో ఇప్పటిది కాదు. అతను అండర్ ట్రయల్‌లోని ఒక ఖైదీ. ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని తినడానికి పోలీసులు అనుమతివ్వకపోవడం వల్ల వారిపై ఉమ్మేసిన ఘటన అది.
ఇదీ చూడండి: వైరస్‌కు ఉక్కపోత.. ఉష్ణ మండలంలో వ్యాప్తి తక్కువే!