విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్లే భారతీయుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. తమ విద్యార్థులను ఎక్కువగా ఆకర్షించేది అగ్రరాజ్యమే. అక్కడి ప్రభుత్వ నిర్ణయాలు ఇబ్బందిపెడుతున్నప్పటికీ... అమెరికా అంటే మన యువతకు ఉండే క్రేజే వేరు. తరువాతి దేశాల్లో కెనడా, ఆస్ట్రేలియా, యురోపియన్ దేశాలున్నాయి.
ఏడాదిలో రూపాయి ఐదు రూపాయలు పతనం...
అంతా బాగానే ఉన్నా.. పడిపోతున్న రుపాయి విలువ... మన విద్యార్థులను కలవరపరుస్తోంది. గత సంవత్సరం జూన్లో అమెరికా డాలరు మారక విలువ 67 రూపాయలుగా ఉండేది. ఇది ప్రస్తుతం 72 రూపాయలుగా ఉంది. కెనడా డాలరుతో పోల్చితే రూపాయి విలువ అటు ఇటుగా అదే స్థాయిలో ఉంటోంది. ఆస్ట్రేలియా డాలరుతో పోల్చితే రూపాయి విలువ పెరుగుతోంది.
విద్యార్థులపై ఆర్థిక భారం...
అమెరికాలో చదువుకోవటానికి సంవత్సరానికి ఒక విద్యార్థికి సరాసరిగా 40వేల డాలర్లు ఖర్చవుతోంది. ఇందులో 30వేలు ఫీజు... 10 వేల డాలర్లు నివాస తదితర ఖర్చులు. ఏడాదిలో పెరిగిన డాలరు విలువతో చదువు పూర్తి చేసేందుకు ఒక్కో విద్యార్థిపై రూ. 2 లక్షల వరకు భారం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉపకారవేతనాలపై వెళ్లిన విద్యార్థులకు ఇది పెను భారమే.
ముందే జాగ్రత్త వహించాలి...
రాబోయే రోజుల్లో డాలరుతో పోల్చితే రూపాయి మరింత పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ నాటికి 80 రూపాయలకు తాకుతుందని అంచనా. ఇదే నిజమైతే చదువు పూర్తి చేసుకోవటానికి వెళ్లిన ఒక్కో విద్యార్థిపై పడే అదనపు భారం రూ.10 లక్షలపైనే ఉంటుంది. ఇది ఏ విద్యార్థికైనా పెను భారమేనని వివిధ కన్సల్టెన్సీల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడే డాలర్లను కొనుక్కోవడం మేలు...
డాలరు విలువను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని వివిధ కన్సల్టెన్సీలు విద్యార్థులకు సూచిస్తున్నాయి. అనిశ్చితిని తగ్గించుకోవటానికి ప్రస్తుతం డాలర్లను కొనుక్కోవటం మేలని సలహానిస్తున్నారు కొందరు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, అంతర్జాతీయ ప్రతికూల పవనాల మధ్య ఈ సలహాను పాటించటం మేలని మార్కెట్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
ఇదీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ