Falaknuma Express Fire Accident Update : యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లి వద్ద జరిగిన ఫలక్‌నుమ ఎక్స్‌ప్రస్ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కాలిన బోగీలను... దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పరిశీలించింది. రైల్వే విద్యుత్ విభాగం అధికారులు అన్ని బోగీలు తిరిగి చూశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్‌సర్క్యూట్ అని భావిస్తున్నారు. ఎన్ని గంటలకు అత్యవసర చైన్ లాగారు? పొగ రావడంతో అలారం ఎన్ని గంటలకు మోగింది? అన్న దానిపై... లోకో పైలట్‌తో పాటు సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. అవసరమైతే రైల్వే భద్రతా కమిషనర్‌తోనూ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు.
నల్లగా మారిన నగలు : మరోవైపు బోగీల్లో చిన్నగా మొదలైన పొగలు క్రమంగా పెద్ద మంటలుగా మారడంతో.. ప్రయాణీకులు తమ సామాగ్రిని ఎక్కడికక్కడే వదిలేసి కిందకు దిగారు. దీంతో బ్యాగుల్లో ఉన్న నగలు, నగదు, విద్యార్థుల ధ్రువపత్రాలు అన్ని కాలిపోయాయి. దర్యాప్తు సంస్థల ప్రతినిధిలు బోగీల్లో ఆధారాలు సేకరిస్తుండగా... పలు చోట్ల నగలు దొరికినట్లు తెలిసింది. అయితే అవి గుర్తుపట్టలేకుండా నల్లగా మారాయని... అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత సంబంధిత వ్యక్తులకు అప్పగించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
Investigation on Falaknuma Express Fire Accident : ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనను విచారిస్తున్న అధికారులు సైతం బీబీనగర్‌లో నిలిపి ఉన్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రేస్ కాలిన బోగీలను పరిశీలించినట్లు సంబంధిత వర్గాల వెల్లడించాయి. కుట్రకోణంలో ప్రమాదం జరిగిందా.. లేదా యాదృచ్చికంగా జరిగిందా.. అన్నదానిపై స్పష్టత రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. సిగరెట్, ఛార్జింగ్ సాకేట్‌తో ఇంత త్వరగా మంటలు వ్యాపించవని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోల్‌కతా, బిహార్‌కు చెందిన కూలీలు హైదరాబాద్‌లో పనిచేస్తుంటారని, వారంతా ఇదే రైలులో నిత్యం ప్రయాణాలు చేస్తారని అన్నారు. వారి వెంట తీసుకువచ్చిన గ్యాస్ పొయ్యిలు ప్రమాదానికి కారణమయ్యాయా అనే కోణంలో దిల్లీ నుంచి వచ్చిన అధికారులు సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు పేలుడు స్వభావం గల పదార్థాలతో పాటు, నిషేధిత వస్తువుల వల్లే 20 నిమిషాల్లోనే ఐదు బోగీలు బుగ్గయ్యాయన్న వాదన వినిపిస్తోంది. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం తెలిసిన వారు ఉంటే.. రైల్వే శాఖకు వివరాలు అందజేయాలని అధికారులు కోరారు. ప్రమాదం గురించి అనుమానం ఉన్న వాళ్లు, తమ దగ్గర ఏవైనా సాక్ష్యాధారాలున్న వాళ్లు... హైదరాబాద్ సంచాలక్ భవన్‌కు ఈ నెల 10, 11 తేదీల్లో వచ్చి సమాచారం ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
అసలేం జరిగిందంటే..: పశ్చిమ బెంగాల్‌లోని హావ్ డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్దకు వచ్చేసరికి మంటలు చెలరేగాయి. వెంటనే ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. ఈ ఘటనలో రైలులోని ఐదు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. మరిన్ని బోగీలకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకు వాటిని ఆ బోగీల నుంచి విడదీసి.. మంటలు వ్యాపించకుండా ముందుగా జాగ్రత్తపడ్డారు.
Falaknuma Express Fire Accident Reason : కాలిపోయిన బోగీల్లో ఎస్4, ఎస్5, ఎస్6 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వివిధ చోట్ల నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించి.. అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని.. ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. మిగిలిన బోగీలను సికింద్రాబాద్‌కు తరలించి.. ప్రత్యేక బస్సుల్లో ఘటనా స్థలం నుంచి ప్రయాణికులను సికింద్రాబాద్ తరలించారు.
పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని.. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ఒడిశా ప్రమాదం జరిగిన తర్వాత కూడా భద్రతా చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు. ఈ దుర్ఘటనతో రైల్వేకు రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదృష్టవశాత్తూ పగటిపూట కావడం, ప్రయాణికులు మేలుకుని ఉండడంతో మంటలు చెలరేగకముందే అందరూ బయటపడ్డారు. లేకపోతే మరో కోరమాండల్ ఘటనే జరగబోయేదని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చదవండి :