ఆర్టీసీ అధికారుల అనాలోచిత చర్య వల్ల ప్రజలకు టికెట్ ఛార్జీ తడిసి మోపెడవుతోంది. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తున్న రూపాయి సెస్సును అధికారులు వేరుగా చూపటంతో ఇప్పుడు ప్రయాణికులు రూ.4 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. డిసెంబరు మూడో తేదీ నుంచి కిలో మీటరుకు 20 పైసల చొప్పున ప్రయాణ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. చిల్లర సమస్యను పరిష్కరించేందుకు గతంలో మాదిరిగా ఐదు, పది రూపాయలకు ఛార్జీలను ఆర్టీసీ సవరించింది. ఇక్కడే ప్రయాణికులకు చిక్కు వచ్చింది.
సెస్సును వేరుగా చూపుతున్నారు
సవరణలో భాగంగా ఛార్జీ రూ.52 అయితే దాన్ని రూ.55కు పెంచారు. ధర రూ.55 అయితే ఎలాంటి మార్పు చేయలేదు. రూ.56 లేదా రూ.57 అయితే దాన్ని రూ. 60కి పెంచారు. ఇందులో ఒక రూపాయి సెస్సు, టోల్‌గేట్లు ఉంటే ఐదు రూపాయిలు అదనం. ఇటీవలి వరకు ఆ విధానం అమలులో ఉంది. గత నెల నుంచి వసూలు చేస్తున్న సెస్సు ఒక రూపాయిని వేరు చూపించటంతో సమస్య మొదలైంది.
రూ.56 నుంచి రూ.60కి పెంపు
ఉదాహరణకు నిర్మల్ నుంచి ఇచ్చొడకు పెంచిన ఛార్జీ రూ.50. దానికి టోల్‌గేట్ ఛార్జీ రూ.5 కలిపితే మొత్తం రూ.55. దీన్ని దగ్గరి రూపాయికి సవరించాల్సిన అవసరం లేదు. కానీ అధికారులు ఒక రూపాయి సెస్సును వేరుగా చూపటంతో టికెట్ ధర రూ.56 అయింది. చిల్లర సమస్య వస్తుందని ఆ మొత్తాన్ని రూ.60కి సవరించారు. ప్రతీ ప్రయాణికుడు అదనంగా నాలుగు రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.
ప్రశ్నించినా స్పందన లేదు
అధిక శాతం మార్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ టికెట్ విధానంపై అవగాహన ఉన్న ప్రయాణికులు అధికారులను ప్రశ్నించినా స్పందన లేదన్నవిమర్శలొస్తున్నాయి. కండక్టర్లను ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెబుతున్నా నెల రోజులుగా ఎలాంటి మార్పు రాలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
ఇవీ చూడండి: రిజర్వేషన్ల ఖరారుకు రంగం సిద్ధం