మద్యం దుకాణాల లైసెన్సులను నెలరోజుల పాటు పొడిగిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న మద్యం దుకాణాలు యథాతథంగా అక్టోబరు 31 వరకు కొనసాగనున్నాయి. సాధారణంగా ఈ నెలాఖరు నాటికి మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగిసి... అక్టోబరు ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రావాల్సి ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు నూతన మద్యం విధానంపై కసరత్తు పూర్తి చేసి నెల రోజుల కిందటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అసెంబ్లీ సమావేశాలతోపాటు... కొత్త విధానంపై చర్చించి విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉండటం వల్ల సకాలంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. అక్టోబరు చివర వరకు దుకాణాల లైసెన్స్‌లను పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి : మహానగరంలో సీజన్ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు