గిరాకీ ఉంటే ఒక ధర.. లేకుంటే మరో ధర. వర్షం పడితే ఒక రేటు.. ఖాళీగా ఉంటే ఇంకోలా ఛార్జీలు.. ఇలా ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోల దోపిడీకి అడ్డే లేకుండా పోతోంది. అదనుచూసి అందినంత దోచుకునే వ్యవస్థకు అడ్డుకట్ట పడాలంటే ప్రజారవాణా అందుబాటులో ఉండాలి. ఆ వ్యవస్థ సక్రమంగా అందుబాటులో లేకపోవడంతో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మెట్రో నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నదే కాకుండా.. దీని ఏర్పాటుకు పలు సంవత్సరాలు పడుతుంది. ఎంఎంటీఎస్‌ను కేవలం 10 కిలోమీటర్లు పొడిగిస్తే విమానాశ్రయంలో అడుగు పెట్టవచ్చు. కాని ఆ దిశగా చర్యలు కానరావడంలేదు.
నాడే అనుసంధాన ప్రతిపాదన..
రూ.816 కోట్ల అంచనాతో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రణాళికలు సిద్ధమైనప్పుడు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధాన ప్రతిపాదన కూడా ఉంది. ఉందానగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. విమానాశ్రయానికి కేటాయించిన భూమిలోకి రైల్వే ట్రాక్ నిర్మాణం..స్టేషన్ ఏర్పాటుకు జీఎంఆర్ సంస్థ అభ్యంతరం చెప్పడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. ఉందానగర్ నుంచి శంషాబాద్ వరకూ 6 కిలోమీటర్లు ఎంఎంటీఎస్‌ను అందుబాటులోకి తెస్తే.. కేవలం 4 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉండేది. అక్కడి నుంచి క్యాబ్‌లు, ఆటోల ద్వారా సులభంగా విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉండేది. కాని ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండో దశ ఫలక్‌నుమా నుంచి ఉందానగర్‌కే పరిమితమైంది.
కి.మీ.కు రూ.10 కోట్ల చొప్పున..
రైల్వే ట్రాక్ నిర్మాణానికి కిలోమీటరుకు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే అధికారుల అంచనా. ఇలా ఉందానగర్ నుంచి నేరుగా విమానాశ్రయానికి 10 కిలోమీటర్లు.. రూ. 100 కోట్లతో నిర్మాణ పనులు పూర్తవుతాయి. అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి తగ్గట్టు రైల్వే స్టేషన్ నిర్మాణంతో పాటు.. మరో రెండు కొత్త స్టేషన్లు నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు మరో రూ.50 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా రూ.150 కోట్లు వ్యయం చేస్తే విమానాశ్రయానికి అతి తక్కువ టికెట్‌తో చేరుకునే ప్రజారవాణా అందుబాటులోకి వస్తుంది. పాలకులు ఈ దిశగా చొరవ చూపాలని పట్టణ ప్రజారవాణా రంగ నిపుణుడు బి.ప్రశాంత్ చెబుతున్నారు. మొత్తం 95 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ రెండోదశ పరిధిలో ఇప్పటికే 85 శాతంనిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులు అందకపోవడంతో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మధ్యలో ఆగిపోయాయని అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో నగర ఎంపీలు అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు.
మెట్రో వచ్చినా.. ఎంఎంటీఎస్ అవసరం
బెంగళూరులోని విమానాశ్రయానికి సబర్బన్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ విషయానికొస్తే.. గచ్చిబౌలి మీదుగా మెట్రో ప్రతిపాదన ఉంది. అది పూర్తవడానికి కొన్నేళ్లు పడుతుంది. ఈలోగా ఎంఎంటీఎస్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుంది. నగరానికి దక్షిణం నుంచి మెట్రో.. తూర్పు వైపు ఎంఎంటీఎస్.. ఇలా రెండు వ్యవస్థలతో నగరం ప్రజా రవాణాలో అగ్రగామి అవుతుంది.
ఇదీ చూడండి: 'న్యూడ్ ఫోటోలు అడుగుతున్నాడు... అడిగితే రొమాన్స్ అంటున్నాడు'