తెలంగాణ నుంచి రాకపోకలు సాగించే జాతీయ రహదారుల్లో రెండు వరుసలుగా ఉన్న మార్గాలను నాలుగు వరుసలకు, నాలుగు వరుసలుగా ఉన్న మార్గాలను ఆరు వరుసలకు విస్తరించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వాహనాల రద్దీకి తగినట్లు రహదారుల విస్తీర్ణం లేకపోవటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతోపాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రహదారులను విస్తరించాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా ఉన్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ట్రాఫిక్ చిక్కులు తొలగనున్నాయి.
మూడు ప్రాంతాల్లో..
హైదరాబాద్-బెంగళూరు మార్గంలోని ఒక ప్రాంతంలో, హైదరాబాద్-నాగ్‌పుర్ మార్గంలోని రెండు ప్రాంతాల్లో రహదారులను విస్తరించనున్నారు. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో అవుటర్ రింగు రోడ్డు దాటిన తరవాతి నుంచి కొత్తూరు వరకు 11.8 కిలోమీటర్ల మార్గం ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉంది. ఆ ప్రాంతాన్ని సుమారు రూ.525 కోట్లతో ఆరు వరుసలకు విస్తరిస్తారు. అలాగే.. హైదరాబాద్-నాగ్‌పూర్ మార్గంలో బోయిన్‌పల్లి నుంచి గుండ్లపోచంపల్లి వరకు సుమారు 17 కిలోమీటర్లు ఆరు వరుసలకు విస్తరించనున్నారు. ఇందుకు రూ.900 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా. ఇదే జాతీయ రహదారిలో గుండ్లపోచంపల్లి నుంచి కల్లకల్లు వరకు 10 కిలోమీటర్ల మార్గాన్ని రూ.500 కోట్లతో నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. ఆయా పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉత్తర్వులు వెలువడిన తరవాత అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తారు.
మిగిలింది ఆ రెండే..
ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-శ్రీశైలం మార్గాలనూ విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గాన్ని నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు, హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలకు విస్తరించాలన్న ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగులో ఉంది. ఇటీవల దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఈ మార్గాలను విస్తరించాలని కేంద్ర జాతీయ రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం కూడా ఇచ్చారు. త్వరలోనే కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి: GRMB & KRMB: 'ప్రాజెక్టుల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బంది వివరాలను అందించాలి'