హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఐటీ పరిశ్రమను వికేంద్రీకరించే ప్రయత్నంలో, నగరమంతా ఐటీ కారిడార్లను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం నలుచెరగులా విస్తరణ వృద్ధి (గ్రిడ్) విధానాన్ని ప్రారంభించింది. 1990 నుంచి హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందింది. 5.5 లక్షల మంది దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. మొత్తం ఐటీ పరిశ్రమ నగర పశ్చిమ దిశలోనే కేంద్రీకృతమై ఉందనే భావన అన్ని వర్గాల్లో నెలకొంది. ఇలా ఒకే చోట గాకుండా నగరం నలువైపులా విస్తరించాలని, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటీ పరిశ్రమలు, కార్యాలయాలను స్థాపించే వారికి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి గ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. హైదరాబాద్‌కు తూర్పు వైపున ఉన్న ఉప్పల్ వైపు దాని బయట ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక పార్కులను ఐటీ పార్కులుగా మార్చడానికి అనుమతించడం, సైబరాబాద్ భద్రతామండలి తరహాలో రాచకొండ భద్రతామండలి ఏర్పాటు, రాయ్‌గిరి వరకు ఎంఎంటీఎస్ సేవల విస్తరణ, మౌలిక సదుపాయాలు, నివాస సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. సుమారు 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు ఐటీ పార్కుల ఏర్పాటు ద్వారా 35,000 మందికి ఉపాధి కల్పన ప్రణాళికను ఖరారు చేసింది. ఆ తర్వాత ఉత్తర, దక్షిణంలోనూ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రమంత్రిమండలి గత ఆగస్టులో నూతన గ్రిడ్ విధానానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీనికింద ఉప్పల్ పారిశ్రామిక పార్కుల్లోని అయిదు తయారీ పరిశ్రమలు ఐటీ రంగానికి తమ కార్యకలాపాలను బదలాయించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ అనుమతించింది.
పారిశ్రామిక పార్కుల్లో సందడి
గ్రిడ్ విధానం నగరంలో వివిధ పారిశ్రామికవాడల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. నగరంలో ఇప్పటికే 1125 కాలుష్యకారక పరిశ్రమలున్నాయి. వీటితో పాటు తయారీ, ఇతర కేటగిరి పరిశ్రమల యాజమాన్యాలు సైతం కొత్త విధానం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఉప్పల్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, జీడిమెట్ల, కాటేదాన్, పటాన్‌చెరు, మల్కాపూర్, గుండ్లపోచంపల్లి, సనత్‌నగర్, కుషాయిగూడ, గాంధీనగర్, బాలానగర్, మేడ్చల్, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని పలువురు పారిశ్రామికవేత్తలు తాము ఐటీ అనుబంధ కార్యకలాపాలు నిర్వహిస్తామని, కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్నారు. కొందరు పారిశ్రామికవేత్తలు తాము కాలుష్య పరిశ్రమల స్థానంలో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకుంటామని, దానికి అనుమతించాలని అభ్యర్థించారు. కొత్త ఐటీ పార్కుల్లో పరిశ్రమల స్థాపనకు భూములు కావాలని కొందరు.. ఉద్యోగుల నివాస సౌకర్యాల కోసం ఇళ్లను నిర్మించే అవకాశం ఇవ్వాలని మరికొందరు కోరారు.
శివార్లలో 12 కొత్త పారిశ్రామికవాడలు
గ్రిడ్ విధానం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాత అది పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇప్పటికే పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు దీనిపై కసరత్తు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా పారిశ్రామికవేత్తల దరఖాస్తులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. గ్రిడ్ విధానం కింద ఐటీ కార్యకలాపాల విస్తరణతో కాలుష్య సమస్య పరిష్కారమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కాలుష్య పరిశ్రమల తరలింపుపైనా ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. నగర శివార్లలో 12కి పైగా కొత్త పారిశ్రామికవాడలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం నగరంలో ఉన్న పారిశ్రామికవేత్తలు తమ స్థలాలను మార్పిడి చేసుకుంటే ఈ సమస్య తీరిపోతుందనే భావనతో ఉంది. పరిశ్రమల పేరుతో స్థిరాస్తి వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకుండా సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనుంది.
- ఇదీ చూడండి : 'భారత్ బంద్'కు ఆర్టీసీ సంఘాల మద్దతు