ప్రతి పౌరుడు ఖాకీ దుస్తులు లేని పోలీసే. పోలీసు ఉన్నతాధికారులు తరచూ చెప్పే మాటలు ఇవి. ప్రజల సహకారం ఉంటేనే, నేరాల ఛేదనతో పాటు సంఘవిద్రోహ శక్తుల ఆటకట్టించి శాంతిభద్రతలు కాపాడొచ్చు. ఈ దిశగా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు. ప్రజలు సైతం పోలీసులతో స్నేహితుల్లా కలిసిపోయి పలు కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. యువతకు దగ్గరవడానికి జాబ్ కనెక్ట్ పేరుతో నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు.
విశేష స్పందన..
యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం వచ్చేలా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు కంపెనీలు అందులో భాగస్వామ్యమయ్యేలా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పేరెన్నికగన్న సంస్థలన్నింటినీ ఒకే వేదికపై చేర్చి... నిరుద్యోగులకు సమాచారం అందిస్తున్నారు. పలు కంపెనీల ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగమిస్తున్నారు. ఆచార్య రాంరెడ్డి దూర విద్యా కేంద్రంలో చేపట్టిన ఉద్యోగ మేళాకు యువత నుంచి విశేష స్పందన వచ్చింది. ఐదు వేల మందికి పైగా యువతులు పేర్లు నమోదు చేయించుకున్నారు. 40కి పైగా కంపెనీలు హాజరై... తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకున్నాయి. కొలువులు కల్పించిన పోలీసుల చొరవపై యువతులు హర్షం వ్యక్తం చేశారు.
వేల సంఖ్యలో కొలువుల కల్పన
ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా 2017లో అప్పటి హైదరాబాద్ సీపీ, ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి జాబ్ కనెక్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాబ్ కనెక్ట్ పేరుతో ప్రత్యేక వాహనం ప్రచారం నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువతకు సంబంధించిన బయోడేటాను సేకరిస్తారు. జాబ్ కనెక్ట్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 16 వేల మంది నిరుద్యోగులకు పలు కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి.
తొలిసారిగా షీటీమ్ ఆధ్వర్యంలో
షీటీమ్ ఆధ్వర్యంలో తొలిసారి కేవలం యువతులకు మాత్రమే ఉద్యోగ మేళా నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు... సమీప ప్రాంతాల్లోని యువతులు విశేషంగా తరలివచ్చారు. ట్రాన్స్ పోర్టు, స్థిరాస్తి, ప్రైవేట్ బ్యాంకులు, టెలీకాలర్, సాఫ్ట్వేర్ సంస్థలు భాగస్వాములయ్యాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించి అర్హతను బట్టి ఉద్యోగం కల్పించాయి. లాక్‌డౌన్‌తో ఉద్యోగం కోల్పోయిన చాలామందికి పోలీసుల చొరవ వల్ల మళ్లీ కొలువులు లభించాయి.
ఇదీ చూడండి: పెద్దగట్టు జాతర సందడికి వేళైంది..