రాష్ట్రంలో రోజురోజుకూ మద్యానికి డిమాండ్ అధికమవుతోంది. ఏటికేడు అమ్మకాలు పెరిగి ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 11 నెలల్లో మద్యం అమ్మకాలపై విధించిన వ్యాట్ ద్వారా పదిన్నరవేల కోట్లకుపైగా రాబడి వచ్చింది. మరో 15 వేల కోట్ల వరకు ఎక్సైజ్ సుంకం, లైసెన్స్ ఫీజులు, ఇతరత్రాల ద్వారా వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం కలిసి ఈ ఆర్థిక ఏడాది ముగిసేనాటికి 28నుంచి 29కోట్ల వరకు అబ్కారీ శాఖ ద్వారా ఆదాయం వస్తుందని లెక్కలు కడుతున్నారు. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 13 వరకు ఏకంగా 25 వేల 657 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 3కోట్లకు పైగా లిక్కర్ కేసులు, రెండున్నర కోట్లకు పైగా బీర్ కేసులు అమ్ముడయ్యాయి. కరోనా, లాక్డౌన్ల మూలంగా మార్చి 22 నుంచి మే 6 వరకు.. సుమారు 46 రోజులపాటు మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడినా... రాబడిలో ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు.
భారీగా ఆదాయం
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కరోనా, లాక్‌డౌన్ మూలంగా పన్నుల రాబడుల్లో కొంత వెనుకబడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాని అబ్కారీ శాఖలో ఎక్సైజ్ సుంకం, లైసెన్స్‌ల రుసుం, ఇతరత్ర ఆదాయాల ద్వారా గత ఆర్థిక ఏడాది రూ.12,600 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఆ మొత్తంపై 27శాతం వృద్ధి నమోదు చేసి రూ.16,000 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఫిబ్రవరి నెల వరకు దాదాపు 15వేల కోట్లు మేర ఎక్సైజ్ సుంకం, లైసెన్స్ రుసుం, ఇతరత్ర ద్వారా వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా వ్యాట్ ద్వారా 2019-20 ఆర్థిక ఏడాదిలో రూ.9,860 కోట్లు రాబడి రాగా ఈ ఆర్థిక ఏడాదిలో గడిచిన 11నెలల్లో ఏకంగా రూ.10,505 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది.
భారీ అంచనాలు
మార్చి నెలలో మరో వెయ్యి నుంచి 12వందల కోట్లు మేర వ్యాట్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 12వేల కోట్లు వ్యాట్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశాలు ఉండగా.. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కూడా నిర్దేశించిన 16వేల కోట్లకు మించి రాబడి వస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే ఈ ఆర్థిక ఏడాది ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.28వేల కోట్ల నుంచి 29వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అబ్కారీ శాఖ అంచనాలు వేస్తోంది.
ఇదీ చదవండి: 'కొవిడ్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోండి'