Excise Department focus On new year celebrations: కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అబ్కారీశాఖ అప్రమత్తమైంది. అనధికారిక లిక్కర్, మాదకద్రవ్యాలు విక్రయాలతోపాటు.. అనుమతి లేని ఈవెంట్లు నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్న ఆబ్కారీ శాఖ నిఘా పెంచింది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో కొత్త సంవత్సర ఈవెంట్లు పెద్దసంఖ్యలో ఉంటున్నందున.. ఎక్సైజ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని నిర్దేశిస్తూ అనుమతులు ఇస్తున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.
ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాల్లో.. రాత్రి ఒంటిగంట వరకు.. బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. సమయాలను పొడిగించడంతోపాటు... వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా అనుమతులు ఇస్తోంది. స్టార్ హోటళ్లు, ఇతర చోట్ల నిర్వహించుకునే వేడుకల్లో.. మాదకద్రవ్యాలు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు జరగకుండా.. నిర్వాహకులే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము అనుమతి ఇచ్చిన సమయంలో పేర్కొన్న నియమావళిని.. ఉల్లంఘించినట్లయితే తక్షణమే రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది.
నూతన సంవత్సరం కోసం సిద్ధం చేసిన దాదాపు 50 కోట్ల విలువైన ఎపిడ్రిన్ మాదకద్రవ్యాలను డీఆర్‌ఐ పట్టుకుంది. హైదరాబాద్ ఉప్పల్, చెంగిచర్ల ప్రాంతంలో రెండు చోట్ల దీనిని తయారు చేస్తున్నట్లు గుర్తించి.. ఏడుగురిని అరెస్టు చేసిన డీఆర్‌ఐ... కీలక సూత్రధారి కోసం వేట కొనసాగిస్తోంది. ఒడిశా నుంచి భారీ మొత్తంలో తెచ్చిన అక్రమ మద్యాన్ని పట్టుకోవడంతోపాటు ఆ రాష్ట్రానికి వెళ్లి.. లిక్కర్ తయారు చేసే పరిశ్రమనే కూల్చేశారు.
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా జరిగే వేడుకల్లో, పబ్బులు, క్లబ్బుల్లో మాదకద్రవ్యాలు విక్రయాలు కొనసాగే అవకాశం ఉందని.. అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. దీంతో స్థానిక ఎక్సైజ్ పోలీసులతోపాటు.. మరో 14 ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపుతున్నారు. ఇవాళ సాయంత్రం నుంచే ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పని చేస్తాయి. దుకాణాల్లో మద్యం విక్రయాల దగ్గర నుంచి పబ్బుల్లో మాదకద్రవ్యాల విక్రయాల వరకు.. అన్ని కోణాల్లో నిఘా పెట్టినట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.
ఇవాళ రాత్రి అయితే పూర్తి స్థాయిలో బృందాలు.. నగరంలో మొబైల్ పార్టీలుగా సంచరించనున్నాయి. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం, నిబంధనలు సక్రమంగా అమలవుతున్నోయో లేదో పరిశీలించనున్నాయి. హైదరాబాద్ నగరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాదకద్రవ్యాలుని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు జరగకుండా... చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: