గత ఏడాది కొవిడ్ కారణంగా రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలతో పాటు ఇతరత్ర కార్యక్రమాలు తగ్గాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే గతేడాది అగ్నిప్రమాదాల సంఖ్య తగ్గింది. 2019లో జరిగిన 8,960 అగ్నిప్రమాదాలతో పోల్చితే 2020లో వెయ్యికిపైగా ప్రమాదాలు తగ్గి 7,899 ప్రమాదాలు సంభవించినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
రూ. 5 లక్షల లోపు ఆస్తి నష్టం జరిగిన కేసులు 7,127 ఘటనలు ఉండగా రూ. 5 నుంచి 10 లక్షల మధ్య ఆస్తి నష్టం జరిగిన ఘటనలు 132కాగా, రూ. 10 నుంచి రూ. 25 లక్షల మధ్య ఆస్తి నష్టం కలిగిన ఘటనలు 99గా ఉన్నట్లు రాష్ట్ర విపత్తులు, స్పందన విభాగం వెల్లడించింది. ఇవి కాకుండా 541 అత్యవసర, రెస్క్యూ ఘటనలు చోటు చేసుకున్నాయి. 2020లో మొత్తం 59 మందిని ప్రాణాపాయ స్థితి నుంచి విపత్తులు, స్పందన దళాలు కాపాడాయి. అదే విధంగా 2019లో రూ.770.46 కోట్ల విలువైన ఆస్తులను కాపాడగా గత ఏడాదిలో రూ.959.85 కోట్ల విలువైన ఆస్తిని కాపాడినట్లు అధికారులు తెలిపారు.
బీడీ, చుట్టల వల్ల...
రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు జరిగిన తీరును ఒకసారి పరిశీలిస్తే అధిక సంఖ్యలో ప్రమాదాలు... మానవ తప్పిదాల వల్లే సంభవించాయి. బీడీ, చుట్ట, సిగిరెట్ లాంటివి తాగిన తరువాత ఆర్పకుండానే ఎక్కడ పడితే అక్కడ పడవేయడం వల్ల 4,187 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల 1,992 కేసులు, గ్యాస్ ప్రమాదాలు 29, రెస్టారెంట్లల్లో చిమ్నీల ద్వారా 12 ప్రమాద ఘటనలు, గడ్డి వాములు, ఇతర నిల్వ పదార్థాల్లో వేడి అధికమై 22 ప్రమాదాలు సంభవించినవి. గ్యాస్ స్టవ్‌ల వాడకం, బహిరంగంగా మంటలు వేయడం లాంటి వాటి ద్వారా మరో 100 ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నట్లు వివరించింది.
అవగాహన కార్యక్రమాలు...
రహదారులపై వేగంగా వాహనాలు రాకపోకలు సాగించిన సందర్భాల్లో రాపిడితో నిప్పు రవ్వలు చెలరేగి 141 ప్రమాద ఘటనలు జరిగినట్లు పేర్కొంది. 233 ప్రదేశాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన విపత్తుల, స్పందన విభాగం అగ్నిప్రమాదాలపై 4,929 అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించింది. 1944 ఏప్రిల్ 14న ముంబయి పోర్టులోని విక్టోరియా డాక్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో భారీగా ఆస్తి నష్టంతోపాటు 66 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అప్పటి నుంచి ప్రతి ఏడాది ఏప్రిల్ 14న అగ్నిమాపక సేవా దినంగా జరుపుతున్నారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ పెట్టే ఆస్కారం లేదు'