రాష్ట్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాల్లో ఉద్యోగుల పీఆర్సీపై బడ్జెట్‌లో ప్రస్తావన ఎక్కడా లేదని ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ వేదికగా బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా ప్రస్తావించలేదని పొన్నాల విమర్శించారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తే ఆ నిధులు ఏవిధంగా సమీకరణ చేస్తారో ఎక్కడ చెప్పలేదన్నారు. గతేడాది భూములు అమ్మడం ద్వారా రూ.10 వేల కోట్లు సమీకరిస్తామని నాలుగు వేల కోట్లు కూడా సమకూర్చుకోలేదని ధ్వజమెత్తారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు. ఉద్యోగాల కల్పనపై ఎక్కడా బడ్జెట్‌లో ప్రస్తావన లేదని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.
మీరు చెప్పేవన్నీ అబద్ధాలే..
రాష్ట్ర బడ్జెట్‌పై అబద్ధాలు చెప్పడం సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. రెండు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టామని ప్రగల్భాలు పలుకుతున్నారు. దేశంలోనే మనం మొదటిస్థానంలో ఉన్నామని చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం విడుదల చేసిన ర్యాంకులు ఒక్కసారి చూడండి. వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. కాంగ్రెస్ హయాంలో హామీలు అమలు చేయలేదంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. త్వరలోనే కేసీఆర్‌కు చర్లపల్లి జైలుకు పోవడం ఖాయం. -పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ అధ్యక్షుడు