ఉద్యానశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ శాఖలో ఉద్యాన అధికారి, ఉద్యాన విస్తరణ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాలలో పండ్లు, కూరగాయలు, పువ్వులు, సుగంధ పంటల వంటి ఉద్యాన పంటలు పండించే రైతులకు సరైన అవగాహన లేక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఈ శాఖలో కేవలం 140 మంది ఉద్యాన అధికారులు మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఉద్యాన విస్తరణ అధికారుల నియామకం జరిపితే, అధికారులు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి పంటల విస్తీర్ణం,ఉత్పత్తి పెంచుతారని వివరించారు. తక్షణమే ఉద్యాన శాఖలో ఉద్యాన అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలు జరపాలన్నారు.