EX MLA Shakeel Son Case Update : ప్రజాభవన్ (పూర్వ ప్రగతిభవన్) వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సి.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాల్లేకుండా కేసు నమోదు చేశారని ఆరోపించారు.
High Court on EX MLA Shakeel Son Accident Case : ఇదే కేసులో రెండో నిందితుడి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారని, అది చెల్లదని అన్నారు. ఏపీపీ సుదర్శన్ వాదనలు వినిపిస్తూ సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయడానికి నిందితుడు అందుబాటులో లేరని, దుబాయ్‌లో ఉన్నారని తెలిపారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఈ నెల 17లోగా నిందితుడు దర్యాప్తు అధికారి ముందు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశాలు ఇవ్వబోగా, సాహిల్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. దానికి న్యాయమూర్తి అనుమతిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.
ప్రజాభవన్ కారు ఘటన - మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎలా తప్పించారంటే?
అసలేం జరిగిందంటే : ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారు ఢీకొట్టింది. దీంతో పంజాగుట్ట పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకున్నారు. కారు సాహిల్దేనని, నడిపింది కూడా అతనేనని పోలీసులు గుర్తించారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం అతనిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన : ఇదిలా ఉండగా, బ్రీత్ ఎనలైజ్ టెస్ట్‌కు తీసుకెళ్తున్న టైమ్‌లో సాహిల్ పారిపోయాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు చేశారు. ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దాకా ఉన్న అన్ని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. అలాగే సాహిల్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు అక్కడ కెమెరాల్లో గుర్తించారు.
నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు సాహిల్‌ను తప్పించి అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చినట్లు డీసీపీకి అర్థమైంది. ఆరోజు నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావు, ఏఎస్ఐ విజయ్‌కాంత్ ఉన్నట్లు ఆయన గుర్తించారు. విచారణ చేస్తున్న సమయంలో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురికాగా, అతన్ని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత ఇన్స్పెక్టర్ను సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
ఏ1గా సాహిల్, ఏ2గా అబ్దుల్ : నిందితులను కోర్టులో హాజరుపరిచే టైమ్‌లో సాహిల్ పేరు ఎఫ్ఐఆర్లో లేదని డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అంతర్గత విచారణ తర్వాత రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1గా సాహిల్‌ను, ఏ2గా అబ్దుల్‌ను చేర్చినట్లు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశామని, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించామని చెప్పారు.