రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు - ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా వార్తలు
రాష్ట్రంలో ఇక నుంచి 60శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో... రిజర్వేషన్ల శాతం పెరగనుంది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఇప్పటి వరకు ఉన్న 50 శాతం రిజర్వేషన్లకు అదనంగా పదిశాతం అమలు కానున్నాయి. ఈ విషయమై రెండు, మూడు రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అవసరమైన ఆదేశాలను జారీ చేయనున్నారు.
రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాల్లో ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎస్టీలకు 6శాతం, ఎస్సీలకు 15, బీసీలకు 25శాతంతో పాటు బీసీఈ కోటాలో వెనకబడిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామని ఉద్యమకాలం నుంచి తెరాస చెబుతూ వస్తోంది. ఇందుకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ 2017 ఏప్రిల్ 16వ తేదీన ఉభయసభల్లో బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలోని సామాజిక పరిస్థితుల ఆధారంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల పెంపును బిల్లులో పేర్కొంది.
50 నుంచి 62కు పెంపు
బీసీఈ కేటగిరీ కింద ఉన్న 4 శాతం రిజర్వేషన్లను 12శాతానికి, గిరిజనులకు అమలు అవుతున్న 6శాతం రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ బిల్లు ప్రకారం రాష్ట్రంలో బలహీన వర్గాలకు 37శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఏ- గ్రూప్ వారికి 7, బీ- గ్రూప్‌కు 10, సీ- గ్రూప్‌కు 1 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. డీ- గ్రూప్‌కు 7, ఈ- గ్రూప్‌లో 12శాతం ఉంటాయి. ఎస్సీలకు ఉన్న 15శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా నిర్ణయించింది. మెుత్తం రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని 50నుంచి 62కు పెంచాలని బిల్లును తీసుకొచ్చింది.
ప్రస్తుతం 50 శాతమే అమలు
రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు ఆయా రాష్ట్రాలకు ఉండాలని... తమిళనాడు తరహాలోని రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును కేంద్రానికి పంపింది. కేంద్రం నుంచి బిల్లుకి ఇప్పటివరకు ఆమోదం లభించకపోవటంతో.... ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి.
10 శాతం రిజర్వేషన్లు అమలు
ఇక అగ్రవర్ణ పేదలకు విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం 2019 జనవరిలో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఆటంకం కలగకుండా రాజ్యాంగ సవరణ చేసింది. అయితే... రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కాలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు, డిమాండ్లు కూడా వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం వివిధ వర్గాలు పొందుతున్న రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి రాష్ట్రంలో 60శాతం రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయమై రెండు, మూడు రోజుల్లోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి... అవసరమైతే ఆదేశాలు జారీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇదీ చూడండి: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు గ్రీన్‌సిగ్నల్