రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వద్ద హత్యాచారానికి గురైన డాక్టర్‌పై జరిగిన దారుణం ఉలికిపాటుకు గురిచేసింది. విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన యువతి ద్విచక్రవాహనం పంక్చర్ కావటాన్ని అవకాశంగా మలచుకుని సాయం చేసే సాకుతో లారీడ్రైవర్లు దారుణానికి తెగబడ్డారు. భాగ్యనగరంలో ఇటువంటి దారుణం చోటుచేసుకోవటం సభ్యసమాజాన్ని నిలదీస్తోంది.
- ముద్దులొలికే చిట్టితల్లి అందాన్ని అందరూ మెచ్చుకుంటుంటే కన్నవారు పొంగిపోయేవారు. ఒకరి మనసు మాత్రం ఈర్ష్యతో రగిలిపోయేది. రోజుల తరబడి గుండెల్లో దాచుకున్న కోపాన్ని తీర్చుకునేందుకు ఆ చిన్నారిని నీటిసంపులో పడేసింది. చిన్నారికి పిన్ని వరుసయ్యే మహిళ దారుణానికి తెగబడటమే దీనికి కారణం. పాతబస్తీలో జరిగిన దారుణం అప్పట్లో కలకలం సృష్టించింది.
- ఉప్పల్ ఠాణా పరిధిలో మూఢనమ్మకంతో ఓ వ్యక్తి నాలుగేళ్ల బాలికను నరబలి ఇచ్చాడు. నమ్మి వెంట వచ్చిన ఆ చిన్నారి మెడను కత్తితో నరుకుతున్నప్పుడు ఆ చిట్టితల్లి ప్రత్యక్ష నరకం అనుభవించి ఉంటుందని పోలీసులు సైతం భావోద్వేగానికి గురయ్యారు.
- చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల వయసు గల ఇద్దరు దివ్యాంగులు హత్యకు గురయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారాల ద్వారా దారుణానికి పాల్పడిన వ్యక్తి ఆ పిల్లల మేనమామే అని గుర్తించారు. అమ్మానాన్నల తరువాత బాధ్యతగా మెలగాల్సిన మేనమామ మానవత్వం మరచి చంపటం కలకలం రేకెత్తించింది.
- కంచన్‌బాగ్ పరిధిలో కొద్దిరోజుల క్రితం ఇద్దరు చిన్నారులు తల్లి చేతిలో హత్యకు గురయ్యారు. కన్నబిడ్డలకు ఇన్సులిన్ ఇంజక్షన్, నిద్రమాత్రలు ఇచ్చి తల్లే వారి మరణానికి కారణమైంది. బిడ్డలకు చిన్న దెబ్బతగిలితే తల్లడిల్లే మాతృహృదయం కఠినంగా ఎందుకు మారిందనేది ప్రశ్నార్థకం.
- హయత్‌నగర్‌లో ప్రియుడి మోజులో కన్నతల్లినే దారుణంగా చంపింది ఓ కూమార్తె. బుద్దులు చెప్పటమే ఆ అమ్మకు మరణశాసనంగా మారింది. ఇప్పటికీ ఆమె ముఖంలో తప్పు చేసిన భావనే లేదు.
ఎవర్ని నమ్మాలి.. ఎవరితో మెలగాలి
ఇటువంటి ఎన్నో సంఘటనలు.. నిత్యం ఏదో మూలన మహానగరంలో కనిపిస్తూనే ఉన్నాయి. మంచిచెడు విచక్షణ మరచిపోయి వికృత చేష్టలకు దిగుతుంటే ఎవర్ని నమ్మాలి. తీయగా పలుకరించే నవ్వుల వెనుక ఆంతర్యం ఎలా గుర్తించాలి. నమ్మకంగా మాట్లాడే పెదవుల మాటున కల్మషాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి. ఆత్మీయంగా దగ్గరకు తీసుకునే చేతుల స్పర్శను ఏమనుకోవాలి. మనిషిని సాటి మనిషి నమ్మాలంటే వందసార్లు ఆలోచించాల్సి వస్తోంది. కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్‌లో రోడ్‌నెంబరు-1లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. ఆ సమయంలో ఎవరైనా మానవత్వంతో కదలిపోతారు. కానీ ఓ ప్రబుద్ధుడు సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటూ కనిపించాడు.
ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య