గతంలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేసిన తనపై ఆ దిశగా కూడా కేసులు పెట్టొచ్చని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తాను ప్రేమతో లొంగదీసుకుంటే లొంగేవాడినని తెలిపారు. భయపెడితే లొంగిపోయే వాడిని కాదని చెప్పారు. ఎంత నష్టపోయినా లొంగిపోయే వాడిని కాదని స్పష్టం స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని అడగొచ్చు
పార్టీ పెడతానని... పార్టీ మారతానని ఎప్పుడూ చెప్పలేదని ఉద్ఘాటించారు. కారు గుర్తుపై గెలిచినందున రాజీనామా చేయమని అడగవచ్చని వ్యాఖ్యానించారు. తాను కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈటల రాజేందర్ పదవుల కోసం పెదవులు మూయడని వెల్లడించారు. హుజూరాబాద్ కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటానని ప్రకటించారు.
మంత్రి పదవి కంటే ఆత్మగౌరవం ముఖ్యం
తన మొత్తం ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోనని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. మంత్రి పదవి కంటే తనకు ఆత్మగౌరవం ముఖ్యమని తెలిపారు. గొప్పగా ఉన్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు భావించట్లేదని వివరించారు. పోలీసులు, అధికారులు ఉన్నారని కబ్జా చేశానని అంటారా? అని ప్రశ్నించారు. అవి దేవాలయ భూములని కాగితాలు తీసుకురండని అన్నారు. కలెక్టర్ నివేదిక పచ్చి అబద్ధమని గొంతెత్తారు. తనలాంటి కొందరు నేతలు ఎందుకు దూరమయ్యామో సీఎం అంతరాత్మకు తెలుసని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నీ అరెస్టులకు.. కేసులకు భయపడే వ్యక్తిని కాదు: ఈటల