Etela Rajendar on LB Nagar Police Station Incident : రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం దళిత, గిరిజన మహిళలపై దాడులు చేయించడం తగదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హితవు పలికారు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో గిరిజన మహిళపై దాడి చేసిన ఘటనలో (Etela Rajendar Reacts Attack on Tribal Woman).. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో దళిత, గిరిజన మహిళపై దాడులు చేస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ ఘటనలను సభ్య సమాజం ఉపేక్షించదని అన్నారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మరియమ్మ అనే దళిత మహిళపై దాడి చేసి చంపారని గుర్తు చేశారు. దీనిపై న్యాయ విచారణ చేసి బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసినా ఫలితం శూన్యమని ఈటల రాజేందర్ ఆరోపించారు.
మరోవైపు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటన.. కరీంనగర్ జిల్లాలో హింసను చూశామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వీటన్నింటినీ ప్రజలు లెక్కపెట్టుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్‌లో.. దళితబంధు పథకం కోసం దళితులు ఆందోళన చేస్తే వారిని భయపెట్టే ప్రయత్నం చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
"గిరిజన మహిళపై దాడి చేస్తే సీఎం కేసీఆర్ స్పందించలేదు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఘటనలపై సీఎం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. భువనగిరి జిల్లాలో మరియమ్మపై దాడి చేసి చంపారు. కరీంనగర్ జిల్లాలోనూ దాడులు, హింసా ఉదంతాలు చూశాం." - ఈటల రాజేందర్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
మరోవైపు పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన మహిళ వరలక్ష్మిని (Raghunandan Rao Reacts Attack on Tribal Woman) బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించారు. కర్మాన్‌ఘాట్‌లోని జీవన్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు వరలక్ష్మి పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికి ట్విటర్లో స్పందించే కేటీఆర్.. దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి.. స్టేషన్ ఎస్హెచ్ఓ స్థాయి అధికారిని కూడా సస్పెండ్ చేయాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
మరోవైపు ఎల్బీనగర్ పోలీసుల దాడిలో గాయపడిన గిరిజన మహిళకు మద్దతుగా.. కర్మాన్‌ఘాట్ రహదారిపై మహిళా సంఘాలు, కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కర్మాన్‌ఘాట్ నుంచి బైరమల్‌గూడ వరకు 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.