ఈఎస్ఐ రాష్ట్ర కార్యాలయంలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. కొందరు ఉన్నతాధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఔషధ కొనుగోళ్లలో నిబంధనలకు పాతరేశారు. డిస్పెన్షరీల్లో వాడే రోగ నిర్ధరణ పరీక్షల కిట్‌లను అవసరానికి మించి, అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. 2015 నుంచి 2019 వరకు కేవలం కిట్ల కోసమే దాదాపు రూ.21 కోట్లు అదనంగా చెల్లించారు. ఔషధాల కొనుగోలులో టెండరు నిబంధనలకు పాతరేయటంతో పాటు వాటి వినియోగంపైనా లెక్కాపత్రాలు లేనట్లు అంతర్గత విచారణాధికారి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు అనిశా గత 3 రోజులుగా సికింద్రాబాద్‌లోని ఈఎస్ఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణాధికారి డాక్టర్ గీత ఆధ్వర్యంలో సోదాలు చేపట్టింది.
నిబంధనలకు పాతరేసిన అధికారులు...
అంతర్గత విచారణలో ఈఎస్ఐలో చోటుచేసుకున్న కొన్ని అక్రమాలను గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ సర్కారు దవాఖానాలకు కిట్లు, రసాయనాలను సరఫరా చేస్తోంది. నిర్ధారించిన టెండర్ ధరల కంటే ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసిన ధరలు అధికంగా ఉన్నాయి. కేంద్ర ఔషధ గోదాములో ఎన్ని ఔషధాలున్నాయో లెక్కాపత్రం లేదు. ఆస్పత్రులకు సరఫరా చేసేటప్పుడు ప్రవేశపత్రం పూర్తి చేయాల్సి ఉన్నా నిబంధనలు పాటించలేదు.
అవసరాలకు మించి కొనుగోళ్లు
కొన్ని రకాల ఔషధాలలో మొత్తం ఏడాదికి సరిపడేంత నిల్వనూ ఒకేసారి కొనుగోలుకు ఉత్తర్వులిచ్చారు. మూడేళ్లలో హైదరాబాద్ పరిధిలో సుమారు రూ.15 కోట్లు, వరంగల్ పరిధిలో రూ.11 లక్షల 86 వేల విలువైన ఔషధ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. సంబంధిత సరఫరా సంస్థలపై, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విచారణాధికారి సర్కారుకు సిఫార్సు చేశారు.
ఇవీచూడండి: మాకు మెట్రో కావాలి.. వేళల్ని పొడిగించండి