కరోనాతో పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నామని.. హైదరాబాద్ రీజినల్ పీఎఫ్ కమిషనర్ వీకే శర్మ తెలిపారు. ఎక్కువగా ఐటీ ఉద్యోగులే దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 వేల 647 మంది, హైదరాబాద్లో 57 వేల 445 మంది ఉద్యోగులు కరోనా కారణంతో పీఎఫ్ ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.
కరోనా కారణంతో దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఇప్పటి వరకు రూ.258 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. కేవలం మూడు రోజుల్లో ఉపసంహరణ దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
గతంలో ఈ సమయం 20 రోజుల పట్టేదన్నారు. కరోనాతో కార్యాలయాల్లో విపరీతమైన ఉద్యోగ లేమి ఉందని.. విడతల వారీగా 30 శాతం మంది సిబ్బందితో పని చేస్తున్నామని పేర్కొన్నారు. పీఎంజీకేవై కింద రాష్ట్రంలోని 11 వేల కంపెనీలు వస్తాయన్నారు. 15 వేల లోపు వేతనం.. 100 మంది లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీల ఉద్యోగుల తరఫున వాటా కేంద్రమే భరిస్తోందన్నారు. దీని కింద ఇప్పటి వరకు 4 వేల 805 కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. మిగతా కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.