ఇంజినీరింగ్ విద్యార్థులు తమ మేధస్సును చాటుకున్నారు. అధ్యాపకుల సహకారంతో అత్యవసర వైద్యానికి వినియోగించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ రూపొందించారు. హైదరాబాద్‌లోని లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ నూతన యంత్రాన్ని ఆవిష్కరించారు.
వాటర్ ప్యూరిఫైయర్తో...
మన ఇళ్లలో వినియోగించే నీటి శుద్ధియంత్రంతో ప్రాణవాయువు అందించే పరికరాన్ని తయారు చేశారు. మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు. అతితక్కువ ధరలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అందించాలనే ఉద్దేశంతో రూపొందించామని విద్యార్థులు తెలిపారు. కేవలం ఇరవై వేల రూపాయల ధరకే అందుబాటులో తీసుకురావాలనేది తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ యంత్రంలో ఎలాంటి సమస్య వచ్చినా మరమ్మతులు చేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఇంకా తక్కువ ధరకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అందించడమే తమ లక్ష్యమని వారు వెల్లడించారు.
ఈ రోజుల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ప్రిన్సిపల్ నరసింహులు తెలిపారు. ఈ సమయంలో వారికి అతి తక్కువ ధరలు అందుబాటులో వచ్చే విధంగా వాటర్ ప్యూరిఫైయర్‌ను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్గా రూపొందించినట్లు వెల్లడించారు. సాంకేతిన పరిజ్ఞానాన్ని వినియోగించి అందుబాటులో తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఈ పరికరాన్ని తయారు చేసిన విద్యార్థులు, అధ్యాపక బృందానికి ప్రిన్సిపల్ ధన్యవాదాలు తెలిపారు.
మా విద్యార్థులు, సిబ్బంది వాటర్ ప్యూరి ఫైయర్తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ తయారు చేశారు. ఏడాదిన్నర కాలంగా కరోనా వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు సమయంలో మేము ఈ ప్రాజెక్టు చేపట్టాం. ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ రూపొందించడంలో మా విద్యార్థులు సక్సెస్ అయ్యారు. ఈ పరికరం అతి తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చాం. రాబోయే కాలంలో ప్రజలకు మరింత తక్కువ ధరలో ఆక్సిజన్ పరికరం అందించేందుకు కృషి చేస్తాం.
- నర్సింహులు, కళాశాల ప్రిన్సిపల్