Telangana Engineering Counselling 2023 : తెలంగాణలో ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో 16,296 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 178 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో (Engineering Convenor Quota) 85,671 సీట్లు ఉండగా.. నాలుగు విడతల్లో 69,375 సీట్లు భర్తీ అయ్యాయి. 18 యూనివర్సిటీ కాలేజీల్లో 4039 సీట్లు కేటాయించగా.. 1496 మిగిలాయి. రెండు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటాలో 1386 సీట్లు ఉండగా.. 289 మిగిలాయి.
రాష్ట్రవ్యాప్తంగా 158 ప్రైవేట్ కాలేజీల్లో 78,750 సీట్లుండగా.. వాటిలో 14,511 మిగిలాయి. ఫార్మసీలో చేరేందుకు ఎంపీసీ అభ్యర్థులు మొగ్గు చూపలేదు. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ కోటా సీట్లలో.. 2.18 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఎంపీసీ విద్యార్థులకు బీఫార్మసీలోని 72 కాలేజీల్లో 2473 సీట్లు ఉండగా.. కేవలం 18 సీట్లు భర్తీ కాగా.. ఫార్మ్ డీలో 412 సీట్లలో.. కేవలం 9 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన ఫార్మా సీట్లను బైపీసీ అభ్యర్థులకు కేటాయించనున్నారు.
ఇవాళ ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ సీట్లను (Engineering Special Batch) కేటాయించారు. కొత్తగా 1966 మందికి సీట్లు దక్కాయి. మరో 10,535 మందికి గతంలో కేటాయించిన సీటు మారింది. రాష్ట్రంలో ఐదు యూనివర్సిటీ, 19 ప్రైవేట్ కాలేజీల్లో కలిపి.. 24 కాలేజీల్లో సీట్లన్నీ భర్తీ కాగా.. ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. సీటు వచ్చిన అభ్యర్థులు ఈనెల 28 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. 29 వరకు కాలేజీలకు వెళ్లి చేరాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. కాలేజీల్లో టీసీ మాత్రమే ఒరిజినల్ ఇవ్వాలని.. మిగతా సర్టిఫికెట్లు జిరాక్స్ మాత్రమే సమర్పించాలని ఆమె పేర్కొన్నారు.
ఇటీవలే ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో 70,627 సీట్లను భర్తీ చేసినట్లు పేర్కొంది. అంతకుముందు మొదటి విడతలో 3 యూనివర్సిటీలు, 28 ప్రైవేట్ కళాశాలల్లో సీట్లన్నీ నిండిపోయాయి. కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన కోర్సుల్లో 94.20 శాతం సీట్ల కేటాయింపు పూర్తిచేశారు. ఈఈఈలో 58.38 శాతం, సివిల్‌లో 44.76 శాతం, మెకానికల్‌లో 38.50 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఈ ఏడాది కూడా కోర్ గ్రూప్‌లకు ఆదరణ బాగా కరువైంది.
ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల పంపిణీ ప్రక్రియలో కన్వీనర్ కోటాలో 7,417 మందికి సీట్లు దక్కగా.. మరో 25,148 మంది కళాశాల లేదా కోర్సులను మార్చుకున్నారు. రెండో విడతలో కన్వీనర్ కోటాలో 12,013 సీట్లు మిగిలాయి. దీంతో 82,702 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా.. 70,689 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 2న ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. కొన్ని కోర్సుల్లో అసలు ఒక్క సీటు కూడా నిండలేదు.
Engineering Seats in Telangana 2023 : రాష్ట్రంలో ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు
CIPET: కొలువులకు నెలవుగా మారిన సీపెట్ విద్యాసంస్థ.. ప్లాస్టిక్ రంగంలో వీరే ఇంజినీర్లు