ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే ఉద్దేశంతో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం(Right to Information Act) అమలుతీరు రాష్ట్రంలో ‘నానాటికీ తీసికట్టు’ అన్నట్టుగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ప్రజా సమాచార అధికారులు’(PIO)గా పనిచేస్తున్నవారు సకాలంలో సమాచారం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. మొదటి అప్పిలేట్ అధికారులూ అదే తరహాలో వ్యవహరిస్తుండటంతో సమాచార కమిషన్‌ను ఆశ్రయంచే బాధితుల సంఖ్య పెరుగుతోంది.
కుప్పలుతెప్పలుగా అప్పీళ్లు
ఏదేని ప్రభుత్వ కార్యాలయంలో పీఐఓకు దరఖాస్తు అందించిన రోజు నుంచి 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని చట్టం చెబుతోంది. ఈ గడువులోగా ఇవ్వకపోతే..అక్కడే ఉండే మొదటి అప్పిలేట్ అధికారి తదుపరి 30 రోజుల్లోగా సమాచారం ఇప్పించేలా చొరవ చూపాలి. అక్కడా న్యాయం జరక్కపోతే దరఖాస్తుదారు సమాచార కమిషన్‌లో తుది అప్పీలును దాఖలుచేయాల్సి ఉంటుంది. పీఐఓ లేదా మొదటి అప్పిలేట్ అధికారులు సక్రమంగా పనిచేస్తే కమిషన్‌కు వచ్చే అప్పీళ్ల సంఖ్య తగ్గుతుంది. అందుకు భిన్నంగా ఇవి నెలనెలా పెరుగుతున్నాయి.
భయం లేకనే
నిజానికి నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వని పీఐఓలకు రూ.25 వేల వరకూ జరిమానా విధించవచ్చని చట్టంలో ఉంది. ఇలా జరిమానా వేయడం కమిషన్‌లో అరుదుగా మారింది. ఐదుగురు సమాచార కమిషనర్లు 2020లో చేరినప్పట్నుంచి ఇప్పటివరకూ 4,314 అప్పీళ్లను విచారించారు. ఒక్క పీఐఓకూ జరిమానా వేయలేదు. ప్రధాన సమాచార కమిషనర్(CIC) 53 కేసుల్లో పీఐఓలకు జరిమానా విధించి, 232 షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఇది కూడా క్షేత్రస్థాయి అధికారుల్లో లెక్కలేనితనాన్ని పెంచిందనే విమర్శలున్నాయి.
ఒక్కరే 1200 దరఖాస్తులు...
స.హ చట్టాన్ని(RTI) స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్న వారూ పెరుగుతున్నారు. కొందరు ఏకంగా కార్యాలయాలు ప్రారంభించి మరీ వివిధ అంశాలపై లెక్కకుమిక్కిలి దరఖాస్తులు ఇచ్చినట్టు తమ పరిశీలనలో వెల్లడైందని ఓ కమిషనర్ ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు చెప్పారు. ‘ఒకతను గ్రేటర్ హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించారు. మహా నగర పరిధిలోని 2, 3 ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో 1,200 దరఖాస్తులిచ్చి సమాచారం అడిగారు. సమాచారం ఇవ్వకపోతే జరిమానా వేయిస్తానని పీఐఓలను బెదిరించారు. ఈ 1,200 కేసులపై కమిషన్‌లో అప్పీళ్లు కూడా దాఖలు చేశారు’ అని ఆయన తెలిపారు. వాటి విచారణ పూర్తయ్యేదాకా కొత్తవాటి విచారణ చేపట్టే అవకాశం ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మరోవ్యక్తి అన్ని వసతిగృహాల్లో దరఖాస్తులు ఇచ్చి, సమాచారం ఇవ్వకపోతే కమిషన్‌కు వెళ్తానని బెదిరించి డబ్బు వసూలుచేసినట్టు తమ విచారణలో తేలిందన్నారు. ప్రజలు అడిగిన సమాచారం ఇవ్వడంలో పీఐఓ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో గుర్తిస్తే జరిమానా విధిస్తున్నట్టు ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ) బుద్దా మురళి ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు చెప్పారు.
ఇదీ చదవండి: Educational Survey: బడుల మూతతో బండబారిపోతోన్న పిల్లల చదువులు.. ఈటీవీభారత్ సర్వే ఫలితాలు