Drugs Case: సంచలనం సృష్టించిన టాలీవుడ్ మత్తుమందుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇప్పటికే హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేయగా ఆబ్కారీ శాఖ తొక్కిపట్టిన ఆధారాలన్నీ సేకరించి కేసుకు ఓ ముగింపు పలకాలని చూస్తోంది. తదనుగుణంగానే ఏర్పాట్లలో మునిగింది.
అయిదేళ్ల క్రితం అంటే 2017 బయటపడ్డ టాలీవుడ్ మత్తుమందుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. కెల్విన్ అనే మత్తుమందుల విక్రయదారుడ్ని ఆబ్కారీశాఖ అధికారులు పట్టుకున్నప్పుడు అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందికి మత్తుమందులు సరఫరా చేసేవాడినని చెప్పడంతో వారందర్నీ పిలిచి విచారించటం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ఆబ్కారీశాఖ మొత్తం 12 కేసులు నమోదు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత దాఖలు చేసిన అభియోగపత్రంలో.. టాలీవుడ్ నటులు మత్తుమందులు వాడుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొనడం కొసమెరుపు.
ఈ కేసు మరుగునపడుతున్న దశలో ఈడీ రంగంలోకి దిగింది. మత్తుమందుల మాటున నిధుల మళ్లింపు జరిగిందన్న ఆనుమానంతో పీఎంఎల్‌ఏ చట్టం కింద గత ఆగస్టులో కేసు నమోదు చేసింది. కోర్టు ద్వారా ఈ కేసుకు సంబంధించి దాదాపు 800 పేజీల ఎఫ్.ఐ.ఆర్., అభియోగపత్రాలు తదితరాలతోపాటు సినీతారలను విచారించినప్పుడు చేసిన వీడియో రికార్డింగుల వంటి 60 జీబీ డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో టాలీవుడ్‌కు చెందిన పూరీ జగన్నాథ్, రకుల్‌ప్రీత్‌సింగ్, రవితేజ, ఛార్మిలతోపాటు మొత్తం 11 మందిని విచారించారు. ఈ కేసులో ఇంకా కొన్ని డిజిటల్ ఆధారాలను ఆబ్కారీశాఖ తమకు అందజేయలేదని ఆరోపిస్తూ ఇటీవల ఈడీ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
ఇదీ చదవండి: 'రికార్డులు ఇవ్వలేదని ఈడీ.. సమాచారమంతా ఇచ్చామంటున్న ఎక్సైజ్'