ఆహారశుద్ధి రంగంలో భారీ యూనిట్లతో పాటు సూక్ష్మ పరిశ్రమల (Micro industries) ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చళ్లు, కారంపొడులు, అప్పడాలు, పోషకాహార చిరుతిళ్ల తయారీ వంటి పది వేలకు పైగా సూక్ష్మపరిశ్రమలను ఏర్పాటు చేయించేందుకు ప్రణాళిక రూపొందించింది. వ్యయంలో 35 శాతం సాయంగా అందించనుంది. వీటి ఏర్పాటులో మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్దపీట వేయనుంది.
వారికి ప్రత్యేకంగా రూ.40 వేల మూల నిధిని సమకూర్చనుంది. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు (Minister Ktr) అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఉన్న సూక్ష్మ పరిశ్రమలను చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా విస్తరించేందుకూ సాయం అందించాలని నిర్ణయించారు.
జిల్లాకో ప్రత్యేక ఆహారశుద్ధి మండలి..
రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమలను భారీఎత్తున స్థాపించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకో ప్రత్యేక ఆహారశుద్ధి మండలి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో కనిష్ఠంగా 500 ఎకరాల చొప్పున మొత్తం 10 వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానించగా 1496 దరఖాస్తులు వచ్చాయి. భారీ పరిశ్రమలతో పాటు అదే స్థాయిలో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి అంకురార్పణ చేస్తోంది. త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది.
అదనపు ప్రోత్సాహకాలు...
ఒక్కో సూక్ష్మ పరిశ్రమ ఏర్పాటుకు అయ్యే వ్యయంలో 35 శాతాన్ని గ్రాంటుగా ఇవ్వడంతో పాటు, మిగిలిన మొత్తాన్ని కేంద్ర పథకాలు, బ్యాంకుల నుంచి రుణాలుగా ఇప్పించేందుకు ప్రభుత్వం సహకరించనుంది. అలానే ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే దళిత, గిరిజన మైనారిటీ, మహిళా పారిశ్రామికవేత్తలు, రైతులకు రాయితీలతో పాటు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: Bhatti vikramarka: 'విద్యార్థి, నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడం దారుణం'