భాగ్యనగరంలో వేలాది మంది రోగులకు ప్రాణాలు పోస్తున్న గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. 50 పడకలతో అత్యవసర విభాగాన్ని నవీకరించినా వైద్యులు లేకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అత్యవసర విభాగంలో కేవలం 22 పడకలతోనే నెట్టుకొస్తున్నారు. ప్రమాదకర స్థితిలో అత్యవసర వైద్యానికి వస్తున్న రోగులు... పడకల పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. డాక్టర్ల కొరత ఉన్నా వైద్య సేవలు అందించడంలో ఈ ఆస్పత్రి చక్కటి పనితీరును ప్రదర్శిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా ఇక్కడకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

ఏడాది కిందటే నిర్ణయించినా...
గాంధీలో రోగుల సంఖ్య పెరగడంతో 22 పడకలతో ఉండే అత్యవసర విభాగాన్ని 50 పడకలకు విస్తరించాలని ఏడాది కింద నిర్ణయించారు. ఈ విభాగాన్ని పూర్తిస్థాయి వసతులతో తీర్చిదిద్దారు. అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశారు. అత్యవసర విభాగం కాబట్టి ప్రతి పడకకు ఒక నర్సు 24 గంటలూ ఉండాలి. వైద్యులు కూడా ఉండాలి. ఈ విభాగాన్ని ప్రారంభించాలంటే కనీసం 50 మంది వైద్యులు, వంద మంది నర్సులు అదనంగా అవసరమని చెబుతున్నారు.

స్థూలంగా గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులు ఇలా...
- అవుట్‌పేషెంట్స్: రోజుకు 4,500 నుంచి 5 వేల మంది
- పడకలు: 1,050; పడకలు తగినన్ని లేకపోయినా దాదాపు 2,300 మంది రోగులు రోజూ ఇన్‌పేషెంట్స్‌గా చికిత్స పొందుతున్నారు.
- వైద్యులు: 350 మంది; కొన్నేళ్లుగా ఈ సంఖ్య పెరగడంలేదు. రోగుల తాకిడికి అనుగుణంగా మరో 250 మంది వైద్యులు అవసరం. పదవీ విరమణతో వైద్యుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా కొత్తగా వైద్యుల నియామకానికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవడం లేదు.
- నర్సులు: 500 మంది (ప్రస్తుత రోగుల సంఖ్యను బట్టి తక్కువలో తక్కువగా మరో 300 మంది అవసరం).
- సెక్యూరిటీ సిబ్బంది: 200 మంది. (మరో 500 మంది అవసరం).
ఇవీ చూడండి: రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు