Egg Recipes Telugu : కోడిగుడ్డు.. ఆహార పదార్థాల్లో అత్యంత పోషకాలు ఉండి.. ఏ రకంగా చేసుకున్నా మినిమమ్ టేస్ట్ గ్యారెంటీ ఉండే ఏకైక వంటకం. అంతే కాదండోయ్ గుడ్డుతో ఎంత కష్టమైన వంటకం తయారు చేసినా సమయం ఎక్కువ పట్టదు. ఇక నిమిషాల్లో తయారు చేసుకునే గుడ్డు వంటకాలు బోలెడున్నాయి. చూస్తుండగానే సండే వచ్చేసింది. ఇక ప్రతీ సండే నాన్ వెజ్ ఏం తింటాం అనుకుంటున్నారా..? మరోవైపు పెరుగుతున్న మాంసం ధరలతో భయపడుతున్నారా..? అందుకే గుడ్డుతో టేస్టీ వంటకాలు చేసుకోండి. హా.. గుడ్డుదేముందు.. గాడిద గుడ్డు అంటారా..? గాడిద గుడ్డు కాదండోయ్.. కోడి గుడ్డుతోనే పసందైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. కేవలం కర్రీలే కాదు.. వాహ్ అనిపించే స్నాక్స్ కూడా చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ స్టోరీ చదివేయండి.. వెంటనే వంటింట్లో గరిట తిప్పేయండి...
షాహి అండా మసాలా(Shahi Anda Masala)
తయారీ విధానం : పాన్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో పసుపు వేసుకోవాలి. నూనెలో గుడ్లను వేసి రెండు నిమిషాలపాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా కట్ చేయాలి. ఇప్పుడు కాసింత నూనె పోసి అందులో ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని మిక్సీలో వేసి ఇందులోనే కాజు, ఎండు మిర్చీ వేసి పౌడర్లా చేసుకోవాలి. ఈ పొడిలో రెండు టమాటలను వేసి మరోసారి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేయించుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలపాటు మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్‌ని వేసి 3 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌పై వేయించాలి. నూనెపైకి తేలే వరకు చిన్నమంటపై ఉడికించాలి. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాల వేసి నూనెపైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు మూడు పెద్ద స్పూన్స్ పెరుగు వేసి మూడు నిమిషాలపాటు చిన్నమంటపై ఉడికించాలి. గ్రేవీ ఎంత కావాలి అనుకుంటున్నారో అన్ని నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. లాస్ట్‌కి ఇందులో ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేయాలి. గ్రేవీ చిక్క పడిన తర్వాత దించే ముందు కసూరీ మేథీ, పుదీనా తరుగు వేసి దింపేయాలి.
ఎగ్ పరాఠా (Egg Paratha)
తయారీ విధానం : మొదట ఓ ప్లేట్లో పిండి, ఉప్పు, చక్కెర, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఈ పిండిపై చెంచా నూనె వేసి ఓ అరగంట గాలి తగలకుండా నానబెట్టాలి. ఇప్పుడు గిన్నెలో గుడ్ల సొనను తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, 1/4 పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర, కారం, ఘాటు ఎంత కావాలో అంత మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టాలి. అన్ని పదార్థాలు కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పిండిని తీసుకుని మళ్లీ ఒకసారి కలిపి ముద్దలుగా చేయాలి. ఒక్కోముద్దను చపాతీలా కాస్త మందంగా వచ్చేలా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కో ఉండనూ పూరీ కంటే కాస్త పెద్ద సైజులో చేసుకోవాలి. కాస్త మందంగా ఉండే చపాతీలా ఉంటే బెటర్. వీటిని పెనంపై వేసి మంటను కాస్త పెద్దగా ఉంచి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇంకో పొయ్యి వెలిగించి ఇనుప పెనం పెట్టుకోవాలి. దీనిపై కాసింత నూనె వేసి అది వేడయ్యాక.. తయారుచేసి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని పోసి ఆమ్లెట్‌లా వేసుకోవాలి. అది కాస్త కాలగానే దానిపై చపాతీ వేసి అట్లకాడతో దానిపై గట్టిగా నొక్కాలి. దీన్ని బాగా కాల్చి పక్కన పెట్టుకావాలి. మరోసారి పెనంపై కాస్త నూనె వేసి కొంచెం గుడ్ల మిశ్రమాన్ని వేసి ఆమ్లెట్‌లా చేయాలి. ఇది ఉడుకుతున్నప్పుడే ముందు చేసిన ఆమ్లెట్ చపాతీని దీనిపై వేయాలి. ఇలా రెండువైపులా ఆమ్లెట్‌తో ఉన్న చపాతినీ మరోసారి పెనంపై అటూ ఇటూ తిప్పుతు ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే రుచికరమైన ఎగ్ పరాఠా రెడీ.
Coconut Health Benefits In Telugu : అధిక బరువు, జుట్టు సమస్యలకు కొబ్బరితో చెక్!
Viral Infection Remedies : ఇంటి చిట్కాలతో.. వైరల్ ఇన్ఫెక్షన్స్కు చెక్!
ఎగ్ ఛాట్ (Egg Chat)
తయారీ విధానం : ఓ గిన్నెలో ఉడికించిన గుడ్లలోని లోపలిభాగాలను తీసుకుని పొడిలా చేసి పెట్టుకోవాలి. మరో గిన్నెలో తెల్లభాగాన్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని కాసింత నూనే వేసి వేడి చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేయించాలి. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవన్ని వేగుతున్నప్పుడే కారం, ఉప్పు, పసుపు, ఛాట్ మసాలా వేసుకుని బాగా కలపాలి. దీంట్లో కాసిన్ని నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లన్నీ మసిలినాక పుదీనా తురుము వేయాలి. ఇందాక కోసి పెట్టుకున్న పచ్చసొన పొడిని, తెల్లముక్కలు వేసి కలపి కాస్త మగ్గనివ్వాలి. అందులో మరికాస్త ఛాట్ మసాలా వేసి కలపాలి. దింపే ముందు చివరగా పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
ఎగ్ శాండ్ విచ్ (Egg Sandwich)
తయారీ విధానం : మొదట ఉడికించిన గుడ్లను చిన్న ముక్కలుగా కోసుకొని ఓ గిన్నెలో వేసుకోవాలి. మయోనీజ్, ఉల్లికాడల తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో రెండు గుడ్లను పగలగొట్టాలి. ఇందులో చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా గిలక్కొట్టాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి బటర్ వేసి.. ఇది కరిగిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న గుడ్డు సొన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకోవాలి. ఇది మగ్గుతున్న సమయంలోనే బ్రెడ్ స్లైస్‌లను ఈ ఆమ్లెట్‌పై రెండువైపులా పెట్టి తీయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్‌లతో సహా ఆమ్లెట్‌ను రెండువైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఆ తర్వాత ఆమ్లెట్‌ను కట్‌చేసి బ్రెడ్ స్లైస్‌పై వేసుకోవాలి. దీనిపై ముందు తయారుచేసి పెట్టుకున్న గుడ్డు మయోమిశ్రమాన్ని ఒక స్లైస్‌పై వేయాలి. మరోస్లైస్‌ను దీనిపై పెట్టాలి. రెండు నిమిషాలపాటు రెండువైపులా బాగా కాల్చుకోవాలి ప్లేట్‌లోకి తీసుకోవాలి.
Drumstick Leaves Powder Benefits : ఈ పొడి తింటే మరింత యవ్వనంగా కనిపించడం ఖాయం!