లాక్డౌన్తో విద్యాసంస్థలు మూతపడి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. సరిగ్గా పరీక్షల సమయం కావడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు విద్యాసంస్థల నిర్వాహకులూ అయోమయంలో పడ్డారు. పదో తరగతి పరీక్షలు రెండు మాత్రమే పూర్తయ్యాయి. డిగ్రీ, ఇంజినీరింగ్ తరగతులు అంతటితోనే ఆగిపోయాయి. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ పై తరగతికి ప్రమోట్ చేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎక్కువ రోజులు ఇలానే ఉంటే.. పిల్లలు ఫోన్లు, టీవీలకు అలవాటు పడి చదువులకు దూరం అవుతారేమోరనని తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. విద్యావేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యాసంస్థల నిర్వాహకులు ఆన్‌లైన్ పాఠాలకు మొగ్గుచూపుతున్నారు.
పోటీ పరీక్షలకు కూడా ఆన్లైన్లోనే...
కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుగా రంగంలోకి దిగాయి. లాక్‌డౌన్ ప్రకటించిన మరుసటి రోజు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వాట్సప్ గ్రూపులు, మొబైల్ యాప్, ఆన్‌లైన్ వీడియోలతో విద్యా బోధన చేస్తున్నారు. వాట్సప్, ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఈ-మెయిల్, స్కైప్, జూమ్, జిట్సీ మీట్, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ వంటి సాంకేతిక పద్ధతులను వినియోగిస్తున్నారు. రెండు ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థలు ఒకే సారి వేల మందికి ఆన్లైన్లో విద్యా బోధన చేస్తున్నాయి. జూమ్ వంటి అప్లికేషన్లతో ఆన్లైన్లో పాఠాలు చెప్పడమే కాకా... విద్యార్థుల సందేహాలు తీర్చడం, హోంవర్క్, రోజు వారీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. పాఠశాల స్థాయి విద్యార్థుల నుంచి జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి కూడా శిక్షణ ఇస్తున్నాయి. హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.
హోం వర్క్.. పూర్తి చేస్తే ప్రోత్సహాకాలంట!
హైదరాబాద్లోని మరో ప్రముఖ కార్పొరేట్ పాఠశాల.. రోజు వారీ పూర్తి షెడ్యూలు యాప్, ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. తెలుగు, ఆంగ్లం వంటి పాఠ్యాంశాలతో పాటు.. డ్యాన్స్, యోగా, ఫిట్నెస్ పాట, వాటర్ బ్రేక్, భోజన ఏ సమయంలో చేయాలో పేర్కొంటూ షెడ్యూలు ఇచ్చి అమలు చేయాలని తల్లదండ్రులకు సూచిస్తున్నారు. ఉప్పల్లోని ఓ పాఠశాల తమ యాప్, ఎస్ఎంఎస్ ద్వారా రోజూ హోంవర్క్ ఇస్తోంది. పాఠశాల పునః ప్రారంభమయ్యాక వాటిని పరిశీలించి... పూర్తి చేసిన వారికి తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని ఉత్తేజపరుస్తోంది. దోమలగూడలోని ఓ పాఠశాల తరగతుల వారీగా వాట్సప్ గ్రూపులు పెట్టి.. విద్యార్థులు చేయాల్సిన హోంవర్క్, ప్రిపేర్ కావాల్సిన ప్రశ్నలు, సమాధాలను పంపిస్తోంది. కొన్ని విద్యా సంస్థలు యూట్యూబ్ వీడియోలతో బోధిస్తున్నాయి.
గవర్నర్ ఆదేశం.. కేటీఆర్ ట్వీట్
విశ్వవిద్యాలయాలు కూడా సాంకేతిక పద్ధతులతో బోధన కొనసాగించే అవకాశాలు పరిశీలించాలని రిజిస్ట్రార్లను గవర్నర్ ఆదేశించారు. అనుబంధ కళాశాలలు విద్యార్థులతో వివిధ ఆన్‌లైన్ విధానాలతో అనుసంధానం కావాలని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ లేఖలు రాశారు. టీ-శాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ద్వారా పిల్లలు ఇంటి నుంచే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్ వంటివి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా ప్రోత్సహించారు. మూక్స్, స్వయం ఆన్ లైన్ వేదికల్లో యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు కూడా విద్యార్థులను ఆన్‌లైన్ బోధనతో అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాయి. ఫోన్, టీవీ ద్వారా చేరువయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నాయి.
ఇదీ చూడండి: పోలీసు విచారణకు తబ్లీగీ జమాత్ అధినేత