ED investigation on TSPSC paper leakage case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణ మగిసింది. నాంపల్లి కోర్టు అనుమతితో రెండు రోజులు చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను ప్రశ్నించిన ఈడీ అధికారులు పలు కీలక సమాచారం సేకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌ను ప్రశ్నించిన అధికారులు.. ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు సేకరించిన ఈడీ.. నిందితుల వాగ్మూలాన్ని నమోదు చేసింది.
ED Inquiry in TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న అనుమానంతో రంగంలోకి దిగిన ఈడీ.. కోర్టు అనుమతితో నిందితులను రెండు రోజులు విచారించింది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌లను పలు ప్రశ్నలు అడిగారు. నిన్న చంచల్‌గూడ జైల్లో దాదాపు ఐదు గంటల పాటు నిందితులపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు
ప్రధానంగా ప్రశ్నపత్రాలు విక్రయించడం ద్వారా ఎంత డబ్బు సంపాదించారు? ఆ సొమ్ము ఏ మార్గంలో స్వీకరించారు? ఏఏ అవసరాలకు వినియోగించారు? అన్న అంశాలపైనే నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. వారి బ్యాంకు ఖాతా వివరాలు చూపుతూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఈడీ బృందం అడిగిన చాలా ప్రశ్నలను ప్రవీణ్ సమాధానం దాటవేసినట్లు, ఎక్కువసేపు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. రాజశేఖర్ మాత్రం తానేమీ డబ్బు సంపాదించలేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిద్దరి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న అధికారులు సాయంత్రం 5.30 గంటల సమయంలో తిరిగి వెళ్లారు.
ఇదిలా ఉండగా.. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సుమారు రూ.40 లక్షల వరకు డబ్బులు చేతులు మారి ఉండొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది. ఈ క్రమంలోనే లాగే కొద్దీ డొంక కదులుతోంది. రోజురోజుకూ కొత్త కొత్త నిందితులు తెరపైకి వస్తున్నారు. డీఏవో ప్రశ్నపత్రాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ దంపతులు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని కొనుగోలు చేసినట్లు ఇటీవల బయటపడింది.
పరీక్షకు ముందు రూ.6 లక్షలు చెల్లించిన ఆ దంపతులు.. ఎగ్జామ్ రాసిన తర్వాత మిగిలిన రూ.4 లక్షలు చెల్లించేలా ప్రవీణ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అన్నీ ప్లాన్ ప్రకారమే జరగగా.. పేపర్ల లీకేజీ ఉదంతం వెలుగులోకి రావడంతో చివరకు దొరికిపోయారు. అయితే ఇలాంటి ఉదంతాలు ఇంకా జరిగి ఉంటాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం ప్రధానంగా ఇలాంటి లావాదేవీలపైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌లను వివిధ కోణాల్లో విచారించారు.
ఇవీ చదవండి:
ED Inquiry in TSPSC Paper Leak: మొత్తం ఎంత డబ్బు చేతులు మారింది..?
TSPSC పేపర్ లీకేజీ.. కారు అమ్మేసి.. ఆ ప్రశ్నపత్రం కొన్న దంపతులు
TSPSC పేపర్ లీకేజీపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్.. కార్యాచరణ ఇదే..!