2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్రం... బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధిని పెంచినట్లు ఎక్కడ చెప్పలేదన్నారు వ్యవసాయరంగ నిపుణులు అరిబండ ప్రసాద్. అన్నదాతలకు గిట్టుబాటు ధరలు అందడంలేదని, రైతులపై రుణభారం పెరిగిపోతోందని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రైతుల సమస్యలు ఎప్పటిలాగే ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో దాన్నుంచి బయట పడేందుకే బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్టు సీనియర్ పాత్రికేయులు దామోదర ప్రసాద్ విశ్లేషించారు. మౌలిక రంగాలకే ఎక్కువ కేటాయింపులు జరిగాయని, అయితే.... కేంద్రం చెబుతున్న అంకెలకు, లక్ష్యాలకు పొంతనలేదని ఆర్థిక విశ్లేషకులు వీవీకే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న ప్రకటనలకు అనుగుణంగా కేటాయింపులు లేవని వారు పేర్కొన్నారు.