ECIR registered by ED officials in case of baiting MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ అధికారులు నమోదు చేసిన ఈసీఐఆర్ మలుపులు తిరుగుతోంది. ఈసీఐఆర్‌ను నిలిపేయాలని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఈడీ అధికారులు తనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారని చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నట్లు ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అటు ఈడీ మాత్రం ఈ కేసు దర్యాప్తులో ముందుకే వెళ్తోంది. ఈ కేసులో అధికారులు ఇప్పటికే రోహిత్‌రెడ్డిని రెండు రోజులపాటు విచారించారు. రోహిత్‌రెడ్డికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు తన పేరున ఉన్న వాహనాల వివరాలను సేకరించారు. ఆధార్, పాన్‌కార్డు, పాస్ పోర్టుల జిరాక్స్ పత్రాలను తీసుకున్నారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఈడీ అధికారులు ఇతర అంశాలపైనా దృష్టి పెట్టారు.
మనీలాండరింగ్ కేసులో భాగంగానే సెవెన్ హిల్స్ మానిక్‌చంద్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అభిషేక్ ఆవలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రోహిత్‌రెడ్డి సోదరుడు రితీశ్‌రెడ్డితో అభిషేక్ ఆవలకు జరిగిన లావాదేవీల గురించి ప్రశ్నించారు. రితీశ్‌రెడ్డితో వ్యాపారం నిర్వహించినట్లు ఈడీ అధికారులకు చెప్పిన అభిషేక్ ఆ మేరకు వివరాలను అందించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే రెండు రోజులపాటు ప్రశ్నించారు.
నందకుమార్ చెప్పిన వివరాలు ఈడీకి కీలకంగా మారనున్నాయి. రోహిత్‌రెడ్డితో నందకుమార్‌కు ఉన్న పరిచయాలను ఆధారంగా చేసుకుని రామచంద్రభారతి, సింహయాజి ప్రలోభ పెట్టినట్లు మెయినాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే నందకుమార్‌ను వాడుకొని రోహిత్‌రెడ్డి మిగతా ఇద్దరినీ ముగ్గులోకి లాగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో నందుకుమార్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బెయిల్ లభించినప్పటికీ, బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన మిగతా కేసుల్లో బెయిల్ లభించకపోవడంతో ఆయన బయటికి రాలేకపోయారు. ఫిల్మ్ నగర్‌లో ఉన్న డెక్కన్ కిచెన్‌కు సంబంధించిన వివాదంలోనే ఏకంగా 6 కేసులు బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదయ్యాయి. ఈ సమీకరణాల మధ్య ఈడీ అధికారుల విచారణలో నందకుమార్ ఏయే వివరాలు చెప్పి ఉండొచ్చనేది ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎమ్మెల్యేలకు ఎర కేసుకు దారి తీసిన అంశాలేమైనా ఈడీ అధికారుల వద్ద గుట్టు విప్పాడా..? రోహిత్‌రెడ్డితో ఉన్న వ్యాపార లావాదేవీల గురించి వివరాలు వెల్లడించాడా..? అనేది చర్చనీయాంశంగా మారింది. నందకుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు తదుపరి చర్యలకు దిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: