EC Focus on Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజక వర్గాల్లోని.. 35,356 పోలింగ్ కేంద్రాల క్షేత్రస్థాయి పరిస్థితులను.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ (Integrated Command Control Room ) ద్వారా క్లుప్తంగా పరిశీలించనున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. నిర్ణయాలు జారీ చేస్తుంటారు. తనిఖీలు, స్వాధీనాలు, ఎన్నికల నియమావళి, ప్రచార ఉల్లంఘనలు, ఫిర్యాదులు, నిఘా బృందాలపై సమన్వయంపై దృష్టి పెట్టారు.
Telangana Assembly Elections Polling Arrangements 2023 : సీ-విజిల్ యాప్ (C VIGIL APP) ద్వారా అందిన ఫిర్యాదులు, సువిధ తదితర అంశాలను కంట్రోల్ రూమ్ నుంచి ఎల్లప్పుడూ పరిశీలిస్తారు. 18 డిస్టిలరీలు, ఆరు బ్రూవరీల దగ్గర పరిస్థితులను సైతం.. కమాండ్ కేంద్రం తెలుపుతుంది. 15 శాటిలైట్ ఛానెళ్లు, 3 యూట్యూబ్ ఛానెళ్లనూ ఇక్కడ నుంచి పరిశీలించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్న కంట్రోల్ రూమ్‌లన్నీ.. ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ పరిధిలోకి వస్తాయి.
EC Inspects Polling Through Command Control Room : 2217 ఎమ్‌సీసీ ఉల్లంఘనలు, నగదు స్వాధీనాలు, రాజకీయ పార్టీల ప్రకటనలను ఇప్పటి వరకు పరిశీలించారు. 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను.. జాతీయ ఫిర్యాదుల పరిష్కార విభాగంలో నమోదు చేస్తారు. గత అక్టోబరు 9 నుంచి ఇప్పటి వరకు 694 ఫిర్యాదులు వచ్చాయి. 85 ఫ్లైయింగ్ సర్వేలెన్స్ బృందాలు, ఎఫ్ఎస్‌టీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల నియమావళి, వ్యయ నిబంధనలకు సంబంధించి మొబైల్ ఫోన్ల ద్వారా ఫొటో, ఆడియో, వీడియో ఆధారాలతో ఫిర్యాదులు పంపడానికి వీలుగా సీ-విజిల్ యాప్ రూపుదిద్దుకుంది. ఇప్పటి వరకు సీ-విజిల్ యాప్‌కు 4643 ఫిర్యాదులు రాగా.. వాటిలో 2858 వాస్తవమని గుర్తించి పరిష్కరించారు.
తెలంగాణలో పక్కా ప్రణాళికతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి : సీఈసీ
రాష్ట్రంలో నామినేషన్లు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు వీలుగా.. సువిధ యాప్ రూపొందించారు. సమావేశాలు, ప్రదర్శనలకూ ఈ యాప్ ద్వారా అనుమతులు పొందవచ్చు. ఓటరు సైతం తన వివరాలు, ఎన్నికల ఫలితాలు, ఈవీఎంలు వాడే విధానాలు సువిధ ద్వారా తెలుసుకోవచ్చు. దీనిలో ఎపిక్ కార్డు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 16 వరకు 119 నియోజకవర్గాల నుంచి అనుమతుల కోసం.. 26,554 విజ్ఞాపనలు అందగా వీటిలో 19,114 అనుమతించారు. 3626 విన్నపాలు తిరస్కరించగా.. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. 437 చెక్‌పోస్టుల్లో 882 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో 33 కంట్రోల్ రూములు పనిచేస్తున్నాయి.
Telangana Assembly Election 2023 : ఈవీఎంలు, పోలింగ్ ప్రక్రియ, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘంపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను పరిశీలిస్తారు. వాటికి తగిన విధంగా సత్వరమే స్పందించేలా పోలీసు, ఐటీ రంగ నిపుణులతో ఒక బృందం పని చేస్తోంది. ఇప్పటి వరకు 25 తప్పుడు కథనాలను గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.