EC Focus on Money Distribution in Telangana Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వివిధ పార్టీల అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ఇందుకోసం ఖర్చు ఎంతైనా తగ్గేదేలే అంటున్నారు. ఇదే సమయంలో ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీగా నగదు, మద్యాన్ని పంపిణీ చేయాలని భావిస్తున్నారు. వీటి పంపిణీకి పోలీసులకు పట్టుబడకుండా దొంగ దారులను వెతుకుతున్నారు. నగరంలో వారం వ్యవధిలో సుమారు రూ.18 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పా జంక్షన్ వద్ద రూ.7.4 కోట్లు.. తాజాగా పంజాగుట్ట గ్రీన్‌ల్యాండ్ కూడలిలో రూ.97.30 లక్షలు.. మరో రెండు సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి చేరిన రూ.8 కోట్ల లావాదేవీలను నిలిపివేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు - ఈవీఎంల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన ఈసీ
Huge Amount of Money Seized in Telangana : బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలతో పాటు స్థిరాస్తి వ్యాపారులు, వ్యాపార సంస్థల ప్రముఖులు బరిలో ఉన్న కొన్నిచోట్ల రూ.కోట్లల్లో నగదును పంచుతున్నారు. సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపీపీ దాకా రూ.లక్షలు ఇచ్చి కొంటున్నారు. ఏమీ అడగని వారి దగ్గరికెళ్లి మరీ ఆఫర్ చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లోని గోదాములు, పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాల్లో భారీగా నగదు భద్రపరిచారనే ఫిర్యాదులతో.. పోలీసు యంత్రాంగం, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ అప్రమత్తమైంది. తనిఖీలు ముమ్మరం చేసింది. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల ఫామ్‌హౌస్‌లపై నిఘా ఉంచింది.
Telangana Assembly Elections 2023 : ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మీదుగా బస్సులు, ఆర్టీసీ కార్గోలు, అంబులెన్స్‌లు, మినీ లారీల ద్వారా డబ్బు సంచులను చేరవేస్తున్నట్టు సమాచారం ఉందని సైబరాబాద్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇంకా కొందరు నేతలు అయితే పాదచారుల ద్వారా కూడా డబ్బు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పుష్ప సినిమా తరహాలో నిత్యావసర వస్తువులను సరఫరా చేసే రవాణా గూడ్స్ వాహనాల ద్వారా కూడా డబ్బు తరలింపునకు పాల్పడుతున్నారు.
ఎన్నికల నిర్వహణలో సవాళ్లు - కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని నియోజకవర్గాలపై ఈసీ నజర్
బ్యాంకు లావాదేవీలపై నజర్ : ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ప్రముఖ సంస్థలు, వ్యక్తుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు జమైతే.. బ్యాంకు అధికారులు ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తున్నారు. తాజాగా బషీర్‌బాగ్ ఐడీబీఐ బ్యాంకులో రెండు సంస్థలకు చెందిన ఖాతాల్లోకి రూ.8 కోట్లు జమ కావటం చర్చనీయాంశంగా మారింది. ఇవి ప్రముఖ పార్టీకి చెందిన అభ్యర్థివి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Huge Amount of Money Seized in vanasthalipuram : కారులో తరలిస్తున్న భారీ నగదును సోమవారం రాత్రి వనస్థలిపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి కారులో వనస్థలిపురం వైపు వస్తున్న కీర్తి (60) నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో కారులో ఉన్న రూ.1.44 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.