Gongadi wool shoes for Farmers : సాధారణంగా బూట్ల ప్రకటనలు అంటే అథ్లెటిక్స్ కోసమే అన్నట్లు చూపిస్తారు. అలాగే తయారు చేస్తారు కూడా. కానీ ఎప్పుడు కాలినడకనే నడిచే రైతుల గురించి మరి. ఇదే ఆలోచనతో ముందుకు సాగారు ఈ యువకులు. అనేక అధ్యయనాల తర్వాత.. రైతుల కోసం గొంగడితో చేసే ప్రత్యేకమైన బూట్లు రూపొందించారు. అందరి మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నారు.
Hyderabad Students Made Shoes For Farmers : ఈ యువకుల పేర్లు సంతోశ్, నకుల్, విద్యాధర్. మొదట ఒకరికి ఒకరు పెద్దగా తెలియదు. వీరందరి చిన్నప్పటి కల ఒక్కటే. అదే కార్లు, బైకులపై ఇష్టం. ఆ ఇష్టంతో ఇంజినీరింగ్ చేయాలి అనుకున్నారు. హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చేస్తూ కలుసుకున్నారు. ఆ సమయంలో అధ్యాపకులు ఇచ్చిన ఓ ప్రాజెక్టు పని కోసం పొలం బాటపట్టారు వీరి బృందం.
ఈ ముగ్గురి కుటుంబాలతో ఏమాత్రం వ్యవసాయ నేపథ్యం లేదు. ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కష్టజీవులైన రైతులు పొలంలో పడుతున్న కష్టాలు చూసి చలించారు. రైతులు పడుతున్న 30కి పైగా సమస్యలను గుర్తించారు. అందులో 5 ప్రధానమైనవని తెలుసుకున్నారు. రైతులు కాళ్లకు ఏం లేకుండా వ్యవసాయ పనులు చేయడం అందులో ఒకటని చెబుతున్నారు ఈ ముగ్గురు.
గొంగడిపై పరిశోధన.. రైతులకు పొలంలో బూట్లు : తాము గుర్తించిన రైతన్నల సమస్యలపై అధ్యయనం చేయాలనుకున్న వీరికి కళాశాల నుంచి కూడా ప్రోత్సాహం లభించింది. దాంతో వివిధ ప్రదేశాలను, రాష్ట్రాలను సందర్శించి.. అక్కడి రైతులతో మమేకమయ్యారు. అప్పుడే గొంగడి గురించి తెలిసింది. ఇదేదో బాగుందే అంటూ గొంగడిపై పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో దాన్ని పూర్తి ప్రత్యేకతలు అర్థం చేసుకున్నారు.
"మాకు తెలుసు ఈ ప్రపంచంలో అమ్మ తర్వాత అన్నం పెట్టేది అన్నదాతే అని. అలాంటి రైతు పంట పండించడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాడు. మేం ఇంట్లో కూర్చొని వాళ్ల కష్టాల గురించి మాట్లాడితే లాభం లేదని తెలుసు. అందుకే వాళ్ల దగ్గరికే వెళ్లాలని నిశ్చయించుకున్నాం. అందుకే వారి వద్దకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు కళ్లారా చూశాం. వారి సమస్యలను గుర్తించాం. అందులో ప్రధానంగా ఐదు సమస్యలను పరిగణనలోకి తీసుకున్నాం." -సంతోశ్ కొంచెర్లకోట, ఎర్తెన్ ట్యూన్ వ్యవస్థాపకుడు
Earthen Tune makes Gongadi wool shoes for Farmers : పొలంలో కాళ్లకు ఏం లేకుండా పని చేస్తూ రైతులు పడుతున్న ఇబ్బందులకు గొంగడి పరిష్కార మార్గంగా కనిపించింది. దాంతో రైతన్నకు తమవంతుగా ఓ మంచి పని చేయాలని ఈ ప్రయోగానికి శ్రీకారం చూట్టారు. పట్టుదలతో అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి అవి ఫలించాయి. గొంగడితో షూలను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు ఈ ముగ్గురు.
గతంలో రైతుల కోసం ప్రభుత్వాలు, పలు కంపెనీలు బూట్లు తయారు చేసి ఇచ్చాయి. కానీ అవేవి అంత ప్రభావం చూపలేదంటున్నారు ఈ యువకులు. బురద, ఇతర కాలానుగుణ పరిస్థితులకు అనుకూలంగా లేకపోవడంతో రైతులు వాటిని ఉపయోగించడం లేదు. పైగా అవి ప్లాస్టిక్‌తో చేసినవి. దాంతో ఉపయోగించని వారు పడేస్తే భూమి కలుషితం అవుంది. ఇలాంటి సమస్యలు ఏవీ మేం చేసిన షూలతో ఉండవని చెబుతున్నారు ఈ యువకులు.
"నేను ఇక్కడ సేల్స్ మార్కెటింగ్ చూసుకుంటాను. సేల్ ఎలా ఉంటుందో చూద్దామని షూ తీసుకొని వెళ్లాం. అక్కడ వచ్చిన ఫీడ్ బ్యాక్ మాకు బాగా అనిపించింది. దాంతో ఆనందంగా ముందుకు సాగుతున్నాం." -తితిక్ష, ఎర్తెన్ ట్యూన్ ఉద్యోగి
గొంగడి బూట్ల ధర 3 వేలు ఉంటే.. రైతులకు రూ.900కే : వినూత్నంగా ఆలోచించి ఎర్తెన్ ట్యూన్స్ అనే ఆంకుర సంస్థ స్థాపించారు ఈ మిత్రులు. ఆ అంకురం నుంచి గొంగడి, ఉన్నితో షూలు చేసి మార్కెట్‌లోని తీసుకువచ్చారు. గొంగడి బూట్లు ధర 2 వేల నుంచి 3 వేల వరకు ఉంటుంది. కానీ సబ్సిడీ ద్వారా రూ.900కే రైతులకు అందిస్తున్నారు. ఇలా వీరు చేస్తున్న ప్రయత్నాలకు ప్రముఖుల నుంచి ప్రశంసలు, మన్ననలు అందుకుంటున్నారు.
ప్రస్తుతం అయిదుగురుతో ఎర్తెన్ ట్యూన్స్ ఆఫీసును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నా రు. రైతులకు మరికొన్ని సరికొత్త షూ డిజైన్లపై రిసెర్చ్ చేస్తున్నారు. వచ్చే ఏడాదికి రైతులను పాము కాటు నుంచి కాపాడే బూట్లు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. వెబ్‌సైట్ బ్యాక్ ఎండ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, షిప్పింగ్, డిజైనింగ్ వంటి అన్ని పనులు వీళ్లే చేసుకుంటున్నారు. ఇలాంటి ఆవిష్కరణల రంగంలో.. వర్క్‌తో పాటు ఫన్ కూడా ఉంటుందంటున్నారు.
ఇవీ చదవండి: