కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల నుంచి ఈసారి అన్ని రకాల వార్షిక పరీక్షలు, ప్రవేశ పరీక్షల ఫీజు రద్దు చేయాలని పలువురు విన్నవిస్తున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తమ రాష్ట్రంలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల రుసుములను ఇప్పటికే రద్దు చేశారు. తెలంగాణలోనూ అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని తల్లిదండ్రులు, సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. తరగతులు జరగకున్నా ప్రైవేటు కళాశాలలు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. కనీసం పరీక్ష ఫీజులైనా రద్దు చేయాలని కోరారు. ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, కనీసం ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకైనా రుసుములు మినహాయించాలని ఐఐటీ జేఈఈ-నీట్ ఫోరమ్ కన్వీనర్ లలిత్‌కుమార్ సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకైనా ఫీజులు మినహాయించాలని మరికొందరు కోరుతున్నారు.
47,729 బీటెక్ సీట్ల భర్తీ
ఎంసెట్ కన్వీనర్ కోటాలో ఈ విద్యా సంవత్సరం(2020-21) బీటెక్‌లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఈసారి స్పాట్ ప్రవేశాల సహా 47,729 సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటాలో మొత్తం 70,141 బీటెక్ సీట్లుండగా అందులో 43,196 కౌన్సెలింగ్, మరో 4,533 స్పాట్ ప్రవేశాల ద్వారా నిండాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ గణాంకాల ప్రకారం గత విద్యా సంవత్సరం(2019-20)తో పోల్చుకుంటే ఈసారి స్వల్పంగా భర్తీ పెరిగింది. పోయిన ఏడాది స్పాట్ ప్రవేశాలు 3,063 సీట్లతో కలుపుకొని మొత్తం 46,134 సీట్లు నిండాయి. ఈసారి అవి 47,729కి పెరిగాయి. కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల్లో చేరేవారు తగ్గడంతో పాటు ఈసారి రాష్ట్రంలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో కన్వీనర్ కోటాలో చేరినవారి సంఖ్య పెరిగిందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి: ఫిబ్రవరి 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు