ఇవాళ ఉదయం నుంచి మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రం ఎన్సీసీ రిజర్వేషన్ ఉన్న విద్యార్థులతో పాటు వికలాంగులకూ ధ్రువపత్రాల పరిశీలీన చేపడుతున్నట్లు హెచ్ఎల్సీ కోఆర్డినేటర్ లక్ష్మయ్య తెలిపారు.
ప్రతీ రోజు 480 మంది విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన
ఎన్సీసీ రిజర్వేషన్ లేని విద్యార్థులకు మాసబ్ ట్యాంక్ వద్దనున్న ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు.
ఇటీవల ఇంటర్ పరీక్షల్లో జరిగిన లోపాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలనను ఎలాంటి అవకతవకలు లేకుండా కొనసాగేందుకు చర్యలు చేపట్టింది. వెస్ట్ మారేడ్ పల్లి పాలిటెక్నిక్ కళాశాలలో ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. ప్రతీ రోజు 480 మంది విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నట్లు అధికారులు తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.
తాము ఉదయాన్నే స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ పద్ధతి ప్రకారం మైక్‌లో పిలవట్లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ధ్రువపత్రాల పరిశీలనకు లోనికి వెళ్లేందుకు స్లిప్పులు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఒక్కసారిగా గేటు వద్ద రద్దీ నెలకొని ఇబ్బందులు పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఐచ్ఛికాల ప్రక్రియ వాయిదా